సచివాలయ ప్రారంభానికి స్టాలిన్‌, సోరెన్‌

తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Updated : 25 Jan 2023 06:45 IST

హాజరుకానున్న ఇద్దరు సీఎంలు
బిహార్‌ డిప్యూటి సీఎం తేజస్వి కూడా
17న భారీ బహిరంగసభ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇద్దరు సీఎంలు, ఒక ఉప ముఖ్యమంత్రితో సహా ఓ పార్టీ జాతీయాధ్యక్షుడు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారాస ఆవిర్భావ సభలో ముగ్గురు సీఎంలు సహా ఓ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఇప్పుడు సచివాలయం ప్రారంభానికి కూడా సీఎంలు హాజరుకానున్నారు. పార్టీ అధికార కార్యక్రమానికి కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను ఆహ్వానించిన కేసీఆర్‌, ఇప్పుడు సచివాలయ ప్రారంభానికి కాంగ్రెస్‌తో భాగస్వాములుగా ఉంటున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించడం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకొన్నట్లయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. 2019 జూన్‌ 27న సచివాలయం నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా, 2021 జనవరిలో పనులు ప్రారంభించారు. తక్కువ సమయంలోనే అన్ని హంగులతో  పూర్తిచేసిన సచివాలయం ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రానుండటంతో ఇది జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు, ఝార్కండ్‌ సీఎంలు  స్టాలిన్‌,  హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌, ఆ రాష్ట్ర సీఎం నీతీశ్‌కుమార్‌ ప్రతినిధిగా జేడీయూ జాతీయాధ్యక్షుడు లలన్‌సింగ్‌ హాజరుకానున్నారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టిన నేపథ్యంలో అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని