సృజనాత్మకంగా తుది మెరుగులు దిద్దండి

‘‘సచివాలయానికి సృజనాత్మకంగా తుది మెరుగులు దిద్దండి. ఇంటీరియర్‌, గోడలకు ఏర్పాటు చేస్తున్న కళాకృతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

Published : 25 Jan 2023 04:37 IST

సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘సచివాలయానికి సృజనాత్మకంగా తుది మెరుగులు దిద్దండి. ఇంటీరియర్‌, గోడలకు ఏర్పాటు చేస్తున్న కళాకృతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రాంగణమంతా ఆహ్లాదకర వాతావరణాన్ని ఆవిష్కరించండి. సందర్శకులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు ఉండాలి. ఆధునిక ఫర్నిచర్‌ను ఉపయోగించండి. పనులు త్వరగా పూర్తిచేయండి. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. తుదిదశలో ఉన్న సచివాలయం పనులను మంగళవారం ఆయన క్షుణ్నంగా పరిశీలించారు. పనులు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యకం చేశారు. భవనంపై ఏర్పాటుచేసిన డోములు, జాతీయ చిహ్నమైన మూడు సింహాలకు మెరుగైన రంగులు వేయాలని సూచించారు. తన కార్యాలయంతో పాటు అంతటా నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు.

బ్యాంకులు, క్యాంటీన్‌, ఏటీఎం, మీడియా సెంటర్‌, సందర్శకుల కోసం చేపడుతున్న నిర్మాణాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఆలయం, మసీదు, చర్చి నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫౌంటెన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటుచేసిన ఆరో అంతస్తులోని కిటికీల నుంచి ప్రాంగణాన్ని పరిశీలిస్తూ హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్మాణంలో ఉన్న పలు కట్టడాలను వీక్షించారు. అంతర్గత రహదారుల వెడల్పు, వాటి నిర్మాణం సిమెంటుతోనా, తారుతోనా అని అడిగినట్లు సమాచారం. రక్షణ, అగ్నిమాపక వ్యవస్థ, ఏసీ ప్లాంటు, జనరేటర్‌ వ్యవస్థ గురించి వివరాలు తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రి  ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఆరూరి రమేశ్‌ దివాకర్‌రావు, భారాస నాయకుడు దాసోజు శ్రవణ్‌, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ, ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ ఐ.గణపతిరెడ్డి, గుత్తేదారు సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని