సీఎంతో అటవీహక్కు పత్రాలు ఇప్పిస్తా

సాగులో ఉన్న గిరిజనులకు నష్టం జరగకుండా పోడు భూములకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేస్లాపూర్‌కు తీసుకువచ్చి హక్కు పత్రాలిప్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు.

Published : 25 Jan 2023 02:57 IST

నాగోబా దర్బార్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌

ఈటీవీ, ఆదిలాబాద్‌: సాగులో ఉన్న గిరిజనులకు నష్టం జరగకుండా పోడు భూములకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేస్లాపూర్‌కు తీసుకువచ్చి హక్కు పత్రాలిప్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు.దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆమె మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబాను దర్శించుకున్నారు. మెస్రం సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన దర్బార్‌లో ఆమె మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం కోసం పాటు పడేది భారాసనేనని, భాజపా నేతల మాదిరిగా చౌకబారు విమర్శలు చేయడం తమవల్ల కాదన్నారు. రాష్ట్రంలో 3.08లక్షల ఎకరాలకుపైగా పోడు భూములకు రైతు బంధు పథకం అమలవుతోందని చెప్పారు. జోడేఘాట్‌లో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులను భారాస ప్రభుత్వం చేస్తే కనీసం ములుగులో ఏర్పాటుచేసే గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులువిడుదలచేయని భాజపా నాయకులు నాగోబాసన్నిధిని సైతం రాజకీయం చేస్తూ మాట్లాడి వెళ్లారని ధ్వజమెత్తారు.

ఎంపీ కనిపించడం లేదు: ఇంద్రకరణ్‌రెడ్డి

ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆచూకీ లేదని, కనిపించడం లేదంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందేమోనని మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జడ్పీ సర్వసభ్య సమావేశాలకు హాజరుకారని, చివరకు ఆదివాసీ ఆరాధ్య దైవమైన నాగోబా సన్నిధిలో అధికారికంగా నిర్వహించే దర్బార్‌కు కూడా రాలేదని విమర్శించారు. పోడు భూముల సర్వే పూర్తయిందని, జిల్లాస్థాయిలో పరిశీలన పూర్తయ్యాక అటవీహక్కు పత్రాలు ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. దర్బార్‌లో ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల జడ్పీ అధ్యక్షులు జనార్దన్‌ రాఠోడ్‌, కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, రాఠోడ్‌ బాపురావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, విఠల్‌, మెస్రం పెద్ద వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని