522 ఎకరాలపై ప్రైవేటు కన్ను!
ఒకటా.. రెండా.. రూ.వేల కోట్ల విలువైన వందల ఎకరాలు అవి. కొన్నేళ్ల నుంచి పరాయి వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా తమ అధీనంలోకి తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు.
కంటోన్మెంట్‌లో బీ3 బంగ్లాల స్వాధీనానికి కొందరి ప్రయత్నం
బల్దియాలో విలీన ప్రతిపాదన నేపథ్యంలో మళ్లీ చర్చ
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, కంటోన్మెంట్-న్యూస్‌టుడే: ఒకటా.. రెండా.. రూ.వేల కోట్ల విలువైన వందల ఎకరాలు అవి. కొన్నేళ్ల నుంచి పరాయి వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా తమ అధీనంలోకి తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్థలాలను అధికారికంగానే తమ పరం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని న్యూబోయినపల్లి, బొల్లారం తదితర ప్రాంతాల్లో సుమారు 117 బీ3 ఓల్డ్‌గ్రాంట్ బంగ్లాలున్నాయి. ఒక్కో బంగ్లా 2.5-13 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఈ బంగ్లాలు, వాటి ప్రాంగణాలు సుమారు 522 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. బ్రిటిష్ సైన్యాధికారుల సౌకర్యార్థం అప్పటి నిజాం భూములివ్వగా వ్యాపారవేత్తలు ఈ బంగ్లాలు నిర్మించారు. బ్రిటిష్ అధికారులు ఇందులో నివాసం ఉండేవారు. స్వాతంత్య్రానంతరం వీటిని అనుభవించే హక్కును(హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్స్-హెచ్‌ఓఆర్) బంగ్లా నిర్మాణదారులు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. భూ యాజమాన్య హక్కులు మాత్రం రక్షణ శాఖ అధీనంలోనే ఉంటాయి. నిబంధనల ప్రకారం హెచ్‌ఓఆర్‌లు బంగ్లాలను ఇతరులకు విక్రయించడంకానీ, లీజులు, సబ్‌లీజులకుకానీ ఇవ్వకూడదు. వాటిల్లో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించకూడదు.
రాజకీయ నేతల కనుసన్నల్లో..
నిబంధనలకు విరుద్ధంగా కొందరు హెచ్‌ఓఆర్‌లు తమ బంగ్లాలను కొంతమంది రాజకీయ నాయకులు, ఇతరులకు విక్రయించారు. రాష్ట్రానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి హెచ్‌ఓఆర్ దగ్గర దాదాపు పది ఎకరాలకు పైగా ఉన్న బంగ్లాను అనధికారికంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో కల్యాణ మండపాన్ని నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లా స్థలాల్లో పేరుమోసిన మరికొన్ని ఫంక్షన్‌హాళ్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వివిధ రకాల కంపెనీలు ఏర్పాటు చేశారు. మరికొన్నింటిని ప్రైవేటు బస్సుల పార్కింగ్ కేంద్రాలుగా మార్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినందున హెచ్‌ఓఆర్‌లపై చర్యలు తీసుకుని ఆ స్థలాలను కంటోన్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. రాజకీయ ఒత్తిళ్లతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ఇటీవల సమావేశంలో చర్చ
కంటోన్మెంట్ పాలనపై కొత్త చట్టం తీసుకురావాలని రక్షణ శాఖ నిర్ణయించింది. సంబంధిత ముసాయిదాలో కంటోన్మెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్(క్లార్)లో బీ3 ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలను హెచ్‌ఓఆర్‌లకే ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకున్న సమయంలో దేశంలోని కంటోన్మెంట్‌లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలనే చర్చ జరిగింది. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే విషయమై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ డిసెంబరులో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తూ రాష్ట్రం, కేంద్రానికి నిరభ్యంతర పత్రం పంపించడంతో కంటోన్మెంట్‌లోని పరిస్థితులపై అధ్యయనం చేసి ఫిబ్రవరి 4లోగా సమగ్ర నివేదికను అందించాలని ఆదేశిస్తూ కేంద్రం ఎనిమిదిమందితో కమిటీని నియమించింది. ఇందులో భాగంగానే ఈనెల 16, 17 తేదీల్లో బోర్డు ప్రతినిధులు, పురపాలక, జీహెచ్‌ఎంసీ అధికారులు సమావేశమయ్యారు. బీ3 బంగ్లాలతో పాటు ఇతరత్రా ఖాళీ స్థలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రస్తుతం గజం రూ.50-80 వేల వరకు ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో 522 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బీ3 ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలు, అనుబంధంగా ఉన్న స్థలాలను తమకు కేటాయించాలని ప్రైవేటు వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వారికి అప్పగించకుండా స్వాధీనం చేసుకుని కేంద్ర, రాష్ట్ర అవసరాల కోసం వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా