పెరుగుతున్న ట్రాక్‌ సామర్థ్యం

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ట్రాక్‌ సామర్థ్యం పెరుగుతోంది. పలు మార్గాలు గంటకు 130 కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా అందుబాటులోకి వస్తున్నాయి.

Updated : 25 Jan 2023 06:10 IST

గంటకు 130 కి.మీ. గరిష్ఠ వేగం..
ద.మ.రైల్వేలో 1,743.4 కి.మీ. మార్గం సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ట్రాక్‌ సామర్థ్యం పెరుగుతోంది. పలు మార్గాలు గంటకు 130 కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా విజయవాడ-దువ్వాడ మార్గంలో గరిష్ఠ వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతించారు. ఈ మార్గంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 132 కిమీ గరిష్ఠ వేగంతో మంగళవారం ప్రయాణించిందని దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో 130 కిమీ గరిష్ఠ వేగంతో రైళ్లు ప్రయాణించేలా అనుమతించిన రైల్వే నెట్‌వర్క్‌ మొత్తం 1,743.4 కిలోమీటర్లకు చేరినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తం విస్తీర్ణంలో ఇది 26.9 శాతానికి చేరింది.

దశలవారీగా పెంపు

జోన్‌లో రైల్వే నెట్‌వర్క్‌ సామర్థ్యం తొలుత 70 కి.మీ.ల వేగం ఉండగా దశలవారీగా రైల్వేశాఖ 110 కి.మీ.ల వరకు పెంచుకుంటూ వచ్చింది. అందులో కొన్ని ప్రాధాన్య మార్గాల్ని 130 కి.మీ.కి పెంచుతోంది. జోన్‌లో కీలకమైన స్వర్ణ చతుర్భుజి (గోల్డెన్‌ క్వాడ్రిలేటరల్‌), స్వర్ణ వికర్ణ (గోల్డెన్‌ డయాగ్నల్‌) మార్గాలు 130 కి.మీ.ల గరిష్ఠ వేగ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చాయి.

స్వర్ణ వికర్ణ మార్గాలు: బల్లార్ష-కాజీపేట-విజయవాడ-గూడూరు. మొత్తం దూరం 744 కి.మీ.లు

స్వర్ణ చతుర్భుజి మార్గాలు: వాడి-గుంతకల్లు-రేణిగుంట 536 కి.మీ, సికింద్రాబాద్‌-కాజీపేట 132 కి.మీ. విజయవాడ-దువ్వాడ 331.4 కి.మీ.

పై మార్గాల్లో రైళ్లు మరింత వేగంతో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే రైళ్లు కాజీపేట మీదుగా ఒకవైపు మహారాష్ట్రలోని బల్లార్ష వరకు, మరోవైపు విజయవాడ మీదుగా అటు విశాఖపట్నం (దువ్వాడ), ఇటు గూడూరు వరకు 130 కిమీ గరిష్ఠ వేగంతో ప్రయాణించవచ్చు. ఇప్పటికే కొన్ని రైళ్ల వేగాన్ని 130 కి.మీ.లకు పెంచారు.


వేగ పరిమితి పెంపు ఇలా

వేగంతో వెళ్లే రైలుని తట్టుకోవాలంటే అందుకు అనుగుణంగా పట్టాలు బలంగా ఉండాలి. పట్టాలతో పాటు వాటి కింద ఉండే స్లీపర్లు, కంకర కూడా కీలకమే. ఇందుకోసం బరువైన రైలు పట్టాలను వేస్తున్నారు. ఒక్కోటి 260 మీటర్ల పొడవైన పట్టాలను ఉపయోగిస్తున్నారు. ట్రాక్‌ మార్గంలో వంపులు, ఎత్తుపల్లాలను సరిచేస్తారు. సిగ్నలింగ్‌ మెరుగుపరుస్తారు. రానున్న రోజుల్లో ట్రాక్‌ సామర్థ్యాన్ని 160 కి.మీ.ల గరిష్ఠ వేగానికి పెంచేలా రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.


ద.మ.రైల్వే నెట్‌వర్క్‌ ఇలా..

మొత్తం జోన్‌ విస్తీర్ణం: 6,471.41 కిమీ

130 కిమీ గరిష్ఠ వేగ మార్గం: 1,743.4 కి.మీ.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు