నీటిపారుదల కేటాయింపులకు పరిమితులు?

నీటిపారుదల రంగానికి బడ్జెట్‌ కేటాయింపు ప్రతిపాదనలపై పరిమితి (సీలింగ్‌) ప్రభావం చూపుతోంది. ఇటీవల ముఖ్య ఇంజినీర్ల వారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలను ఒకసారి సమర్పించగా.. మార్పులు చేయాలంటూ ఆర్థికశాఖ కొంత మేర సీలింగ్‌ (పరిమిత మొత్తం) సూచించినట్లు తెలిసింది.

Published : 25 Jan 2023 02:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల రంగానికి బడ్జెట్‌ కేటాయింపు ప్రతిపాదనలపై పరిమితి (సీలింగ్‌) ప్రభావం చూపుతోంది. ఇటీవల ముఖ్య ఇంజినీర్ల వారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలను ఒకసారి సమర్పించగా.. మార్పులు చేయాలంటూ ఆర్థికశాఖ కొంత మేర సీలింగ్‌ (పరిమిత మొత్తం) సూచించినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు తగ్గించి పంపిన ప్రతిపాదనలపై మరోమారు సీలింగ్‌ విధించినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టుల వారీగా నిధులను సర్దుబాటు చేసేందుకు ఇంజినీర్లు కుస్తీ పడుతున్నారు. భారీగా కేటాయింపులుంటాయని భావించిన ప్రాజెక్టులకు కూడా కోతలు పడినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.11 వేల కోట్ల వరకు అవసరమని ఇంజినీర్లు ప్రతిపాదించగా రూ.5,900 కోట్లతో సర్దుకోవాలనే సంకేతాలు వచ్చినట్లు తెలిసింది. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలు సమర్పిస్తే.. తాజాగా రూ.2,700 కోట్లకు పరిమితం చేసినట్లు సమాచారం. బ్యాంకులు, ఆర్థికసంస్థల రుణాలకు చెల్లించాల్సిన వడ్డీల కిస్తీలు భారీగానే ఉన్నాయి. రాష్ట్రంలో మరో కీలక ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డికి కూడా కేటాయింపులు తగ్గినట్లు తెలిసింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ఉన్న నాగర్‌కర్నూల్‌ సర్కిల్‌ నుంచి రూ.5 వేల కోట్లకు ప్రతిపాదనలు సమర్పించగా రూ.1700 కోట్లకు సర్దుకోమని మొదట సూచించి.. తాజాగా రూ.1400 కోట్లకు సీలింగ్‌ పెట్టినట్లు సమాచారం. డిండి, ఏఎమ్మార్పీ ఎస్సెల్బీసీతోపాటు పలు చిన్నతరహా ఎత్తిపోతల పథకాల నిర్మాణాలున్న నల్గొండ సర్కిల్‌ నుంచి రూ.9 వేల కోట్లకు ప్రతిపాదనలు వెళ్లగా మొదటి సీలింగ్‌లో రూ.2000 కోట్లుగా సూచించి తాజాగా రూ.650 కోట్లకు సరిపెట్టినట్లు తెలిసింది. ఇక్కడ భూసేకరణకే ఎక్కువ నిధులు ఖర్చయ్యే పరిస్థితులున్నాయి. వనపర్తి జిల్లాకు మొదట రూ.400 కోట్లు, తాజాగా రూ.180 కోట్లకు పరిమితి విధించినట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో కీలకంగా ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు, భూసేకరణ, వరద కాలువ కింద చివరిదశ పనులు కలిపి కరీంనగర్‌ సర్కిల్‌ నుంచి రూ.వెయ్యి కోట్లకు ప్రతిపాదనలు పంపగా మొదట రూ.500 కోట్లకు, చివరకు రూ.220 కోట్లకు పరిమితి విధించినట్లు సమాచారం. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న కొత్తగూడెం సర్కిల్‌కు రూ.వెయ్యి కోట్లు తుది ప్రతిపాదన చేసినట్లు, ఇతర సర్కిళ్ల ప్రతిపాదనల్లోనూ సర్దుబాట్ల ప్రభావం పడినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని