సంక్షిప్త వార్తలు (9)
వచ్చే వేసవిలో రాష్ట్రంలోని అన్ని ఆవాసాలు, విద్యా సంస్థలకు నిరాటంకంగా తాగునీటి సరఫరా కొనసాగాలని, అందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ అధికారులను ఆదేశించారు.
వేసవిలో నిరాటంకంగా తాగునీటి సరఫరా
మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్
ఈనాడు, హైదరాబాద్: వచ్చే వేసవిలో రాష్ట్రంలోని అన్ని ఆవాసాలు, విద్యా సంస్థలకు నిరాటంకంగా తాగునీటి సరఫరా కొనసాగాలని, అందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ అధికారులను ఆదేశించారు. వేసవిలో మిషన్ భగీరథ నీటిసరఫరాపై హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కేంద్ర కార్యాలయంలో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్ల నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించడం, ఇంటేక్వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఉన్న పంపులు, మోటార్ల పనితీరును సరిచూసుకోవడంతో పాటు సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మారుమూల, అటవీ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలు, గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గిరిజన, సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చెంగ్తు, ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, అన్ని జిల్లాల చీఫ్ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
28వ తేదీ తరువాత భవిష్యత్ కార్యాచరణ: వీఆర్ఏ ఐకాస
ఈనాడు, హైదరాబాద్: రెండేళ్ల క్రితం శాసనసభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 28వ తేదీలోపు వీఆర్ఏలను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించకుంటే భవిష్యత్ కార్యాచరణ చేపడతామని వీఆర్ఏ ఐకాస పేర్కొంది. మంగళవారం నగర శివారులో నిర్వహించిన ఐకాస అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణతో పాటు పలు సమస్యల పరిష్కారానికి గతేడాది ఆందోళనలు చేపట్టగా ప్రభుత్వం చర్చలు నిర్వహించిందని ఐకాస నాయకులు పేర్కొన్నారు. గతేడాది డిసెంబరు 21న మంత్రి కేటీఆర్ సంఘ నాయకులతో చర్చలు జరిపారని, ఆ తెల్లారి ప్రగతి భవన్‌కు పిలిచి సమస్య పరిష్కరించకుండా ఉత్తిచేతులతో పంపారని పేర్కొన్నారు. నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పట్టించుకోని కారణంగా రాష్ట్రంలోని వీఆర్ఏలు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఐకాస నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు సాయన్న, వెంకటేశ్, ఎస్కే రఫీ, గోవింద్, ఉమామహేశ్వర్రావు, రాములు, రమేష్, రాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
3 జిల్లాలకు కొత్త డీఈఓలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు జిల్లాలకు డీఈఓలను నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎస్సీఈఆర్టీలో ఆచార్యుడు కె.రవికాంత్‌రావు; జయశంకర్ భూపాలపల్లికి హనుమకొండ డీఈఓ కార్యాలయంలో సహాయ సంచాలకుడు ఎన్.రామ్‌కుమార్; మహబూబ్‌నగర్ డైట్ కళాశాల లెక్చరర్ షేక్ లియాఖత్ అలీ నారాయణపేట డీఈఓగా నియమితులయ్యారు.
పీఆర్సీ ఇవ్వకుంటే 2న మహాధర్నా
సీఎండీకి విద్యుత్ ఉద్యోగుల ఐకాస నోటీసు
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు ఈ నెల 31లోగా వేతన సవరణ (పీఆర్సీ) అమలు చేయకుంటే వచ్చే నెల ఒకటిన ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 2న విద్యుత్‌సౌధ వద్ద మహాధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి (ఐకాస) హెచ్చరించింది. సమితి నేతలు మంగళవారం జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలసి ఈ మేరకు వినతిపత్రం పేరుతో నోటీసు ఇచ్చారు. సీఎండీని కలసిన వారిలో ఐకాస ఛైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు, శ్రీధర్, బీసీరెడ్డి, సదానందం, రాంజీ తదితరులున్నారు.
మరో 2.18 లక్షల మందికి కంటి పరీక్షలు
హైదరాబాద్: కంటి వెలుగు రెండోవిడత కార్యక్రమంలో భాగంగా మంగళవారం మరో 2,18,381 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకూ నేత్ర పరీక్షలు పొందిన వారి సంఖ్య 8,41,649కి పెరిగింది.
ఐఏఎస్ పదోన్నతులకు దిల్లీలో మౌఖిక పరీక్షలు
రాష్ట్రం నుంచి తొలిరోజు పాల్గొన్న 14 మంది అధికారులు
ఈనాడు,హైదరాబాద్ : తెలంగాణలోని రెవెన్యూయేతర విభాగంలో ఖాళీగా ఉన్న అయిదు ఐఏఎస్ (కన్ఫర్డ్) పోస్టులకు అర్హులైన అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో మంగళవారం తొలివిడత మౌఖిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 14 మంది అధికారులు హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతిసుడాన్ మౌఖిక పరీక్షల కమిటీకి అధ్యక్షత వహించగా... యూపీఎస్సీ నుంచి మరో సభ్యునితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జీఏడీ కార్యదర్శి శేషాద్రి సభ్యులుగా ఉన్నారు. తొలిరోజు వి.శ్రీనివాసులు, ఎస్.సురేశ్, కె.హరిత, డి.శ్రీనివాస్‌నాయక్, ఎన్.యాదగిరిరావు, కె.చంద్రశేఖర్‌రెడ్డి, ఈవీ నరసింహారెడ్డి, కె.అశోక్‌రెడ్డి, వి.సైదా, పి.మహేందర్, డి.ప్రశాంత్‌కుమార్, టి.వెంకన్న, ఇ.నవీన్ నికోలస్, వి.సర్వేశ్వర్రెడ్డిలు హాజరయ్యారు. ఈ నెల 27న జరిగే రెండో విడత మౌఖిక పరీక్షలకు 11 మంది అధికారులు..వి.శ్రీనివాస్‌రెడ్డి, పి.కాత్యాయనీదేవి, పి.వెంకటేశం, ఆర్.లక్ష్మణుడు, ఎ.పుల్లయ్య, ఆర్.ఏడుకొండలు, డి.హన్మంతు, సి.చంద్రకాంత్‌రెడ్డి, వి.పాపయ్య, జీవీ నారాయణరావు, ఎం.పద్మజలు హాజరుకానున్నారు.
జూట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం విలీనంపై నేడు ఉత్పత్తిదారుల నిరసన
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ జూట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని కోల్‌కతాలోని ప్రధాన కార్యాలయంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ నాంపల్లిలోని సంస్థ కార్యాలయం ఎదుట బుధవారం రాష్ట్ర జూట్ ఉత్పత్తిదారుల సంఘం నిరసన ప్రదర్శన నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ఆందోళన చేపట్టనున్నట్లు సంఘం నేతలు జయసరిత, ప్రియదర్శిని, చంద్రికలు తెలిపారు. ప్రాంతీయ కార్యాలయాన్ని కేంద్ర కార్యాలయంలో విలీనం చేయడం వల్ల తెలంగాణలో జూట్ పరిశ్రమ అభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందన్నారు. ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని కోరారు.
నేడు, రేపు పొడి వాతావరణం
ఈనాడు, హైదరాబాద్ : దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వివరించింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట చలి ఉంటోంది. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ శివారు హకీంపేటలో గాలిలో తేమ సాధారణంకన్నా 23 శాతం అధికంగా ఉంది.
జీరో సర్వీసు టీచర్లను బదిలీ చేయాలి
ఈనాడు, హైదరాబాద్ : జీరో సర్వీసు టీచర్లకు బదిలీ అవకాశం కల్పించాలని.. సీనియర్ టీచర్లకు సర్వీసు పాయింట్లను పరిగణలోకి తీసుకుని బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ విద్యాశాఖ కార్యదర్శికి మంగళవారం వినతిపత్రం అందజేసింది. సర్వీసు పాయింట్లను తొలగించడం వల్ల వయసు పైబడ్డ టీచర్లు మెరుగైన స్థానాలను కోల్పోతారని తెలిపింది. వారికి న్యాయం చేయాలని కోరింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Hanuma Vihari: అలా చేస్తే నా కెరీర్లో రిస్క్‌లో పడుతుందని ఆయన పది సార్లు చెప్పాడు: హనుమ విహరి
-
Movies News
Social Look: హల్దీ వేడుకలో పూజాహెగ్డే.. సమంత ‘లైట్’ పోస్ట్!
-
India News
Loan Apps: 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా!
-
Politics News
KCR: నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్
-
Movies News
Thaman: నెగెటివిటీపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. రమీజ్ అప్పటి వ్యాఖ్యలు.. ఇప్పుడు నజామ్ మాటల్లో..!