బైరి నరేష్‌ జైలు నిర్బంధంపై నివేదికివ్వండి

ఒక మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయి, చర్లపల్లి జైలులో ఉన్న బైరి నరేష్‌కు అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు.. అతను ఉన్న పరిస్థితులపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ) సభ్యకార్యదర్శికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 25 Jan 2023 04:43 IST

లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఒక మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయి, చర్లపల్లి జైలులో ఉన్న బైరి నరేష్‌కు అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు.. అతను ఉన్న పరిస్థితులపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ) సభ్యకార్యదర్శికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలు అధికారులతో సంప్రదించి నరేష్‌ను మరో బ్యారక్‌కు తరలించడానికి ఉన్న అవకాశాలపైనా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బైరి నరేష్‌ను చర్లపల్లి జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచడం సరికాదని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఒకే కేసుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని.. అతని భార్య సుజాత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ భర్తను ఏకాంతంగా ఒక గదిలో ఉంచుతున్నారని, విచారణ ఖైదీలకు కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ చర్లపల్లి జైలు అధికారులు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదన్నారు. ఒక మతానికి సంబంధించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇతర ఖైదీల నుంచి ప్రమాదం లేకుండా ప్రత్యేకంగా ఉంచినట్లు తెలిపారు. ఈమేరకు పూర్వాపరాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని