జాతీయ విపణిలోకి అంతర్రాష్ట్ర విద్యుత్కేంద్రాలు

ఒకటికి మించి రాష్ట్రాలకు కరెంట్‌ సరఫరా చేసే విద్యుత్కేంద్రాల్లో మిగులు విద్యుత్‌ను జాతీయ విపణిలో అమ్మడానికి కొత్త ప్రతిపాదనలను కేంద్ర విద్యుత్‌శాఖ మంగళవారం విడుదల చేసింది.

Updated : 25 Jan 2023 04:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒకటికి మించి రాష్ట్రాలకు కరెంట్‌ సరఫరా చేసే విద్యుత్కేంద్రాల్లో మిగులు విద్యుత్‌ను జాతీయ విపణిలో అమ్మడానికి కొత్త ప్రతిపాదనలను కేంద్ర విద్యుత్‌శాఖ మంగళవారం విడుదల చేసింది. వీటిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వచ్చేనెల 22లోగా పంపాలని సూచించింది. ఇంతకాలం కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ విద్యుత్కేంద్రాల్లో మిగులు విద్యుత్‌ను ఏ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) అయినా నేరుగా ఏరోజుకారోజు కొనుగోలు చేసేలా పైలట్‌ ప్రాజెక్టును 2019 నుంచి కేంద్రం అమలు చేస్తోంది. దీనివల్ల ఇప్పటివరకూ విద్యుత్‌ అమ్మకాలపై రూ.2300 కోట్లు ఆదా అయినట్లు వివరించింది. ఈ ప్రయోగం విజయవంతమైనందున ఇకనుంచి అంతర్రాష్ట్ర ప్రైవేటు విద్యుత్కేంద్రాలను సైతం ఈ పథకంలోకి తీసుకురావాలని సంకల్పించినట్లు తెలిపింది. వివిధ రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా చేసే ప్లాంటులో ఏరోజైనా కొనుగోలుదారులకు అవసరం లేక మిగులు విద్యుత్‌ ఉంటే దానిని జాతీయ విపణిలో అడిగిన డిస్కంలకు అమ్ముకోవచ్చంది. ఈ విధానం వల్ల డిమాండు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్‌ అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఆసక్తి గల అంతర్రాష్ట్ర విద్యుత్కేంద్రాలు జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని