రాజ్‌భవన్‌ X రాష్ట్ర ప్రభుత్వం

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించడంపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Updated : 26 Jan 2023 07:09 IST

గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మరోసారి వివాదం
రాజ్‌భవన్‌లోనే ఉదయం 7 గంటలకు వేడుక

ఈనాడు, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించడంపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాయడంతో ఆమె అసహనానికి గురయ్యారని సమాచారం. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. కరోనా కారణంగా పరేడ్‌ నిర్వహించడం లేదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, ప్రజలను కూడా అనుమతించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై చర్చించారు. ఆఖరి నిమిషంలో పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేయడానికి ఉన్న సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. చివరకు రాజ్‌భవన్‌లోనే పరేడ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు.. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం ఏడు గంటలకు రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నట్లు ఆమె కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ఆరుగంటలకు అధికారిక ప్రకటన వెలువడింది. 

రెండేళ్లుగా ఇదే తీరు..

గత రెండేళ్లుగా రాజ్‌భవన్‌కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య దూరం పెరుగుతూ రాగా, కొన్ని నెలలుగా తీవ్రమైంది.  కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై సీఎం, మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం, ఎమ్మెల్సీల నియామకంలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసి పంపిన పేర్లపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఎక్కువ రోజులు పెండింగ్‌లో పెట్టడం, గవర్నర్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లినపుడు ప్రభుత్వపరంగా ప్రోటోకాల్‌ ఏర్పాటు చేయకపోవడం.. వంటివి ఒకదానికొకటి తోడై.. విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. చాలాకాలం తర్వాత ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు స్వాగత కార్యకమ్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై కలిసి పాల్గొన్నారు. ఇటీవల కాలంలో తరచూ గవర్నర్‌ రాష్ట్రప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకలు మరోసారి వివాదానికి తెరలేపాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజ్‌భవన్‌లోనే ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పది రోజుల కిందటే గవర్నర్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. పాండిచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తున్న తమిళిసై బుధవారం ఉదయం హైదరాబాద్‌ వచ్చారు. గురువారం నిర్వహించాల్సిన గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఆమె రాజ్‌భవన్‌ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఖమ్మంలో అయిదు లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తే లేని కొవిడ్‌.. పరేడ్‌ గ్రౌండ్‌లో రిప్లబిక్‌డే వేడుకలకు వస్తుందా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. తమిళిసై గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన తర్వాత సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి వెళ్లి అక్కడ రిప్లబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొంటారని సమాచారం. ఇక్కడ జరిగిన పరిణామాలన్నిటినీ ఆమె కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని