ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం

తెలంగాణ నిఘా విభాగం అధిపతి అనిల్‌కుమార్‌ ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్‌ పతకాని(పీపీఎం)కి ఎంపికయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌(టీఎస్‌ఎస్పీ) 12వ పటాలం అదనపు కమాండెంట్‌ బృంగి రామకృష్ణకూ ఈ పతకం దక్కింది.

Published : 26 Jan 2023 05:28 IST

టీఎస్‌ఎస్పీ 12వ పటాలం అదనపు కమాండెంట్‌ రామకృష్ణకు కూడా
రాష్ట్రంలో మరో 13 మందికి ఉత్తమ సేవాపతకాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నిఘా విభాగం అధిపతి అనిల్‌కుమార్‌ ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్‌ పతకాని(పీపీఎం)కి ఎంపికయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌(టీఎస్‌ఎస్పీ) 12వ పటాలం అదనపు కమాండెంట్‌ బృంగి రామకృష్ణకూ ఈ పతకం దక్కింది. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే పురస్కారాల్లో మరో 13 మందికి ఉత్తమ సేవా పతకాలు లభించాయి. పతకాలు లభించిన వారికి డీజీపీ అంజనీకుమార్‌ అభినందనలు తెలిపారు.

అనిల్‌కుమార్‌ ప్రస్తుతం అదనపు డీజీపీగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన 1996 ఐపీఎస్‌ బ్యాచ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. మావోయిస్టు ప్రభావిత ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేశారు. కర్నూల్‌ డీఐజీగా, హైదరాబాద్‌ ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం(ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. నిఘావిభాగంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవముంది. ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో పనిచేసిన కాలంలో అఫ్గానిస్థాన్‌లోని ఇండియన్‌ ఎంబసీలో సేవలందించారు. అనంతరం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం ఐజీగా పనిచేస్తూ అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. అక్కడినుంచి తెలంగాణ నిఘావిభాగం చీఫ్‌గా బదిలీ అయి ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌(సీఐ) విభాగాన్నీ పర్యవేక్షిస్తున్నారు. హరియాణా రాష్ట్రం కర్నాల్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లాకు ఆయుధాల చేరవేత కేసును చేధించినందుకుగాను గతేడాది ఆయన నేతృత్వంలోని సీఐసెల్‌కు స్పెషల్‌ ఆపరేషన్‌ మెడల్‌ దక్కింది.

1991లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ విభాగం(ఏపీఎస్పీ)లో చేరిన రామకృష్ణ ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో ఆర్‌ఎస్సై, ఆర్‌ఐగా పనిచేశారు. ఈ క్రమంలో 1998లో అప్పటి ముఖ్యమంత్రి భద్రత విభాగంలో పనిచేశారు. అనంతరం 2003 వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. 2003 నుంచి గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వర్తించారు. ఇందుకు గుర్తింపుగా 2009లో ఏపీ పోలీస్‌ సేవాపతకం, 2019లో ఉత్తమ సేవాపతకం, 2014లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. గ్రేహౌండ్స్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు శిక్షణ సంస్థల్లోనూ శిక్షకుడిగా వ్యవహరించారు. ఐపీఎస్‌లతోపాటు గ్రేహౌండ్స్‌ సిబ్బందికి రిఫ్రెషర్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నల్గొండలోని టీఎస్‌ఎస్పీ 12వ పటాలం అదనపు కమాండెంట్‌గా పనిచేస్తున్నారు.


ఉత్తమ సేవాపథకాలు పొందినవారు..

1. తరుణ్‌ జోషి, ఐజీ, శిక్షణ

2. విశ్వప్రసాద్‌, జాయింట్‌ కమిషనర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, హైదరాబాద్‌ కమిషనరేట్‌

3. గంగసాని శ్రీధర్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్‌

4. పూనాటి నరసింహారావు, డీఎస్పీ, నిఘా విభాగం

5. రామపోగు అరుణ్‌రాజ్‌ కుమార్‌, డీఎస్పీ, హైదరాబాద్‌

6. గాండ్ల వెంకటేశ్వర్లు, సీఐ, కరీంనగర్‌

7. మామిల శ్రీధర్‌రెడ్డి, సీఐ, ఐటీ సెల్‌, హైదరాబాద్‌

8. నారాయణ స్వామి జైశంకర్‌, ఏఆర్‌ఎస్సై, మూడో బెటాలియన్‌

9. కారుకొండ దయాశీల, ఆర్‌ఐ, వరంగల్‌

10. గంగుల అచ్యుత రెడ్డి, అసిస్టెంట్‌ అస్సాల్ట్‌ కమాండర్‌, గ్రేహౌండ్స్‌

11. నడింపల్లి రామ్‌దేవ్‌రెడ్డి, సీఐ, నిఘా విభాగం, హైదరాబాద్‌

12. ఇజారి వీర రామాంజనేయులు, ఏఆర్‌ఎస్సై, సీఐ సెల్‌, హైదరాబాద్‌

13. బోండ వెంకట సన్యాసీరావు, సీఐ, టీఎస్పీఎఫ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు