భారీ భవనాలకు అగ్ని ప్రమాద నియంత్రణ ఆడిట్‌

‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆకాశహర్మ్యాల్లో అగ్ని ప్రమాద నియంత్రణ(ఫైర్‌ సేఫ్టీ) ఆడిట్‌ నిర్వహించాలి. ప్రమాదాల నియంత్రణ కోసం డ్రోన్‌, రోబోటిక్‌ సాంకేతికత వినియోగానికి ఉన్న అవకాశాలపై దృష్టిసారించాలి.

Published : 26 Jan 2023 04:24 IST

డ్రోన్లు, రోబోటిక్‌ సాంకేతికత వినియోగంపై దృష్టి
ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆకాశహర్మ్యాల్లో అగ్ని ప్రమాద నియంత్రణ(ఫైర్‌ సేఫ్టీ) ఆడిట్‌ నిర్వహించాలి. ప్రమాదాల నియంత్రణ కోసం డ్రోన్‌, రోబోటిక్‌ సాంకేతికత వినియోగానికి ఉన్న అవకాశాలపై దృష్టిసారించాలి. ప్రమాదాల నియంత్రణకు ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను త్వరితగతిన అధ్యయనం చేయాలి. హైదరాబాద్‌లో ఇటీవల అగ్నిప్రమాదంలో మరణించిన ముగ్గురికి అయిదేసి లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి’ అని రాష్ట్ర మున్సిపల్‌ వ్యవహారాలు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ భవనాల్లో భద్రత ఏర్పాట్లపై ఇక్కడి బీఆర్కే భవన్‌లో బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న భారీ భవంతుల్లో అగ్ని ప్రమాద నియంత్రణకు ఉన్న ఏర్పాట్లు ఏమిటన్నది మున్సిపల్‌, పోలీసు, అగ్ని ప్రమాద శాఖలు సంయుక్తంగా పరిశీలన చేసి భవనాల వారీగా ఆడిట్‌ నివేదికలు రూపొందించాలి. తనిఖీల జాబితాలో ఆస్పత్రులు, పాఠశాల భవనాలు, పెట్రోలు బంకులు, గ్యాస్‌ గోదాములు, వాణిజ్య భవనాలు.. ఇలా అన్నీ ఉండాలి. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించాలి. ఆడిట్‌ పేరుతో ప్రజలను, భవన యజమానులను ఇబ్బందులు పెట్టవద్దు. అవసరమైతే 1999లో రూపొందించిన అగ్ని ప్రమాద నియంత్రణ చట్టాలను సవరించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలి. అగ్ని ప్రమాదాల నియంత్రణ కోసం ఆధునిక వ్యవస్థను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏమేం కావాలన్నది యుద్ధప్రాతిపదికన గుర్తించి సీఎస్‌కు నివేదిక అందజేయండి’ అని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌యాదవ్‌, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు