రాష్ట్ర వృద్ధిరేటు భళా..

తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌- జీఎస్‌డీపీ) విలువ 2021-22లో రూ.11,48,115 కోట్లకు చేరింది.

Published : 26 Jan 2023 04:24 IST

19.4 శాతం నమోదు... రూ.11.48 లక్షల కోట్లకు చేరిన జీఎస్‌డీపీ
దేశంలో మూడో స్థానం
నివేదిక విడుదల చేసిన డీఈఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌- జీఎస్‌డీపీ) విలువ 2021-22లో రూ.11,48,115 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 19.4 శాతం అదనంగా పెరిగింది. జీఎస్‌డీపీ వృద్ధిరేటు పెరుగుదలలో ఒడిశా, మధ్యప్రదేశ్‌ల తరువాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర అర్థ, గణాంక శాఖ(డీఈఎస్‌) రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక-అట్లాస్‌’లో వెల్లడించింది. ఈ నివేదికను బుధవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో వివిధ రంగాల వృద్ధికి సంబంధించిన గణాంకాలను డీఈఎస్‌ వివరించింది. పలు రాష్ట్రాలతో పోలుస్తూ తెలంగాణ సాధించిన అభివృద్ధిని తెలిపింది. 2012-13 నాటి నుంచి పోలిస్తే రాష్ట్రంలో 2021-22లో అత్యధికంగా 19.4 శాతం వృద్ధిరేటు నమోదైంది. అంతకుముందు అత్యధిక వృద్ధిరేటు 2018-19లో 14.3 శాతంగా ఉంది. జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతం. 

* 2020-21తో పోలిస్తే 2021-22లో జీఎస్‌డీపీ వృద్ధి రేటు అత్యధికంగా ఒడిశాలో 20.55, మధ్యప్రదేశ్‌లో 19.74, తెలంగాణలో 19.4 శాతం, ఏపీలో 18.47 శాతంగా ఉన్నాయి. 

* ప్రస్తుత ధరల్లో తెలంగాణ తలసరి వార్షిక ఆదాయం రూ.2,75,443. జాతీయ సగటు రూ.1,50,007.

  నల్గొండలో రైతుల మరణాలు అధికం

* 2018-22 మార్చి వరకు రాష్ట్రంలో 88,620 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.4,431 కోట్లను జీవిత బీమా పరిహారంగా ఇచ్చింది. మృతుల్లో 49-59 ఏళ్ల మధ్య వయసువారు 40,214 మంది ఉన్నారు.

* నాలుగేళ్ల కాలంలో రైతుల మరణాలు అత్యధికంగా నల్గొండ(5,673), సంగారెడ్డి (5,489), కామారెడ్డి(4,596), మెదక్‌ (4,160), నిజామాబాద్‌ (3,968) జిల్లాల్లో సంభవించాయి.  

21 మంది విద్యార్థులకు ఒక టీచర్‌

* రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు 41,369 ఉండగా.. వీటిలో 62,28,665 మంది చదువుకుంటున్నారు. ఒక పాఠశాలకు సగటు విద్యార్థులు 151 మంది కాగా 21 మందికి ఒక టీచర్‌ ఉన్నారు.

ప్రగతికి తార్కాణం: వినోద్‌కుమార్‌

రాష్ట్రం సాధిస్తున్న పురోభివృద్ధికి గణాంకాలే తార్కాణమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. డీఈఎస్‌ నివేదికను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక పురోగతి, జీఎస్‌డీపీ వృద్ధిరేటు, అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరాలను ఈ నివేదికలో సవివరంగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు డాక్టర్‌ జి.ఆర్‌.రెడ్డి, సంచాలకుడు జి.దయానందం, రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌డీపీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రామకృష్ణ, కన్సల్టెంట్‌ రామభద్రం తదితరులు పాల్గొన్నారు.


66.7 విస్తీర్ణంలో పంటలు

రాష్ట్ర భూభాగంలో 66.7 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. 2019-20లో మొత్తం కోటీ 84 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని డీఈఎస్‌ వివరించింది.

* పత్తి సాగు విస్తీర్ణంలో 2020-21లో 23.58 లక్షల హెక్టార్లతో మహారాష్ట్ర తరువాత రెండో స్థానంలో ఉన్న తెలంగాణ పంట ఉత్పాదకతలో మాత్రం 10వ స్థానంలో నిలిచింది.హెక్టారుకు సరాసరి 418 కిలోల దూది మాత్రమే ఉత్పత్తి అయింది. దీనికి పూర్తి విరుద్ధంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణంలో 15వ స్థానంలో ఉంటే ఉత్పాదకతలో హెక్టారుకు 4,646 కిలోలతో రెండోస్థానంలో నిలిచింది. తమిళనాడు 7,276 కిలోలతో ముందుంది.

* 2020-21లో వరి సాగు విస్తీర్ణం, ఉత్పాదకతలోనూ రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. చండీగఢ్‌లో అత్యధికంగా హెక్టారుకు 5,500 కిలోల బియ్యం దిగుబడి రాగా... 3,206 కిలోలతో తెలంగాణ 5వ స్థానానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని