EPFO: వృద్ధులకు ‘అధిక పింఛను’ షాక్
దేశవ్యాప్తంగా వృద్ధాప్యంలోని ఈపీఎఫ్ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) షాక్ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వయసులో వారిపై బకాయిల భారం మోపనుంది.
అధిక వేతనంపై పొందుతున్న పింఛన్లు రద్దు చేసిన ఈపీఎఫ్‌ఓ
గరిష్ఠవేతన పరిమితి రూ.5 వేలు, రూ.6,500 ప్రకారం పింఛను సవరించాలని నిర్ణయం
ఇప్పటివరకు చేసిన అదనపు చెల్లింపులు రికవరీ చేయాలని ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వృద్ధాప్యంలోని ఈపీఎఫ్ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) షాక్ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వయసులో వారిపై బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు ఉద్యోగ పదవీ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న పింఛనుదారులకు ఆ అధిక పింఛనును రద్దుచేసింది. ఉద్యోగుల పింఛను నిధి (ఈపీఎస్)లో వాస్తవిక వేతనంపై చందా చెల్లించేందుకు పింఛను పథకం సవరణకు ముందుగానే యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తున్న అధిక పింఛను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2023 జనవరి నుంచి అధిక పింఛను నిలిపివేసి, ఈపీఎఫ్‌వో నిర్ణయించిన గరిష్ఠ వేతన పరిమితి రూ.5,000/రూ.6,500పై సవరణ పింఛను నిర్ణయించి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు చేసిన అదనపు చెల్లింపుల రికవరీ విషయంలో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు చర్యలు తీసుకుంటారని వెల్లడించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్-1(పింఛన్లు) అప్రజిత జగ్గీ అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.
అప్పట్లో సరే...ఇప్పుడు నోరెత్తని వైనం
ఈపీఎఫ్ చట్టం ప్రకారం 2014 నాటి సవరణకు ముందు పింఛను పొందేందుకు గరిష్ఠ వేతన పరిమితి(బేసిక్+డీఏ) రూ.6,500గా ఉంది. అంతకు మించి అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌లో చేరేందుకు వేతనం మొత్తంపై 8.33 శాతం జమ చేయాలి. కానీ ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు తుది గడువేమీ చెప్పలేదు. 2014 సెప్టెంబరు1న గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచుతూ సవరణ చేసింది. దీనికి ముందు ఈపీఎస్‌లో జమ చేసేందుకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు మాత్రమే సవరణ చట్టం ప్రకారం ఆర్నెల్లలోగా అధికవేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. అప్పటివరకు ఉమ్మడి ఆప్షన్‌పై గడువు లేదని, పింఛను పథకం సవరించిన తరువాత ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం లేకుండా చేశారని ఆర్‌సీగుప్తా-ఈపీఎఫ్‌వో (2015 ఏడాది) కేసులో చందాదారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఉమ్మడి ఆప్షన్‌కు స్పష్టమైన గడువు పేర్కొననందున, 2014 సెప్టెంబరుకు ముందుగా పదవీవిరమణ చేసి అధికవేతనంపై ఈపీఎఫ్ చందా కట్టినవారికి అధిక పింఛను పొందేందుకు అవకాశమివ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు 2017లో ఈపీఎఫ్‌వో ప్రత్యేక సర్క్యులర్ ద్వారా అధికవేతనంపై చందా కడుతున్నవారి నుంచి ఆప్షన్ తీసుకుని, ఆ మేరకు అదనపు ఈపీఎస్ నిధిని చందాదారుని నుంచి సమీకరించి అధికపింఛను మంజూరు చేసింది. తాజాగా నెలరోజుల క్రితం అధిక పింఛనుపై ఇచ్చిన ప్రత్యేక సర్క్యులర్‌లో.. 2014 సెప్టెంబరు 1కి ముందుగా ఆప్షన్ ఇచ్చినవారికే అధిక పింఛను మంజూరు చేస్తామని తెలిపింది. పింఛను పథకం సవరణకు ముందుగా (2014 సెప్టెంబరు1) పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇప్పటికే పథకం నుంచి వైదొలిగారని, వారంతా యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వనందున సుప్రీంకోర్టు తీర్పు కాపీ పేరానం.44(5) ప్రకారం అధికపింఛనుకు అనర్హులని తెలిపింది.
బకాయిలన్నీ రికవరీ చేయాలి
2014 సెప్టెంబరు 1 కంటే ముందు వరకు అధిక పింఛను కోసం ఆప్షన్ ఇవ్వకుండా అధిక పింఛను పొందుతున్న వారికి పింఛను నిలిపివేయాలని నిర్ణయించింది. పూర్వగరిష్ఠ వేతన పరిమితి రూ.5000/రూ.6,500 ప్రకారం పింఛను సవరించేందుకు ముందస్తు నోటీసులు జారీచేయాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లను ఆదేశించింది. 2014 సెప్టెంబరుకు ముందుగా ఉమ్మడి ఆప్షన్ ఇచ్చారన్న ఆధారాన్ని సమర్పించాలంది. అలాచేయకుంటే సవరణ పింఛను తర్వాత ఏమైనా బకాయిలుంటే వాటిని తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకోనుంది. పింఛను సవరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘనలు లేకుండా చూడాలని తెలిపింది. బకాయిలు వసూలు చేయాలన్న నిర్ణయంపై పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛనుదారులను ఇబ్బంది పెట్టేలా ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జారీచేసిన సర్క్యులర్ ఇంకా అమల్లోనే ఉందన్నారు. ఈ సర్క్యులర్ ప్రకారం అధిక పింఛను కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చందాదారులుగా కొనసాగుతున్న ఉద్యోగుల్లో అధిక వేతనంపై అధిక పింఛను పొందేందుకు ఉమ్మడి ఆప్షన్‌కు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించినా పట్టించుకోవడం లేదన్నారు.
హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వరరావు ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ 2011 జూన్‌లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ నాటికి ఆ ఉద్యోగి వేతనం (బేసిక్+డీఏ) 16వేలుగా ఉంది. ఆ సంస్థ అతను పొందుతున్న వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించింది. ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500గా ఉండటంతో ఆ వేతనంపై అతనికి రూ.2,070 పింఛను మంజూరైంది. 2015 ఆర్‌సీగుప్తా కేసు ప్రకారం 2017లో ఆ ఉద్యోగి అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా కట్టడంతో అధిక పింఛను ఇవ్వాలంటూ యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇస్తూ దరఖాస్తు చేశారు. దరఖాస్తు పరిశీలించిన ఈపీఎఫ్‌వో అధికవేతనంపై 8.33శాతం చొప్పున ఈపీఎస్‌కు రూ.2 లక్షలు కట్టాలని డిమాండ్ నోటీసు జారీ చేసింది. అంత మొత్తం జమచేశారు. సుప్రీం తీర్పుమేరకు అధికవేతనంపై (రూ.16 వేల చివరి వేతనం) పింఛను రూ.6,500గా ఖరారైంది. 2017 వరకు పింఛను బకాయిల కింద రూ.3 లక్షలు వచ్చాయి. తాజాగా ఈపీఎఫ్‌వో ఆదేశాలతో అతనికి పింఛను రూ.2,070గా ఖరారు కానుంది. ఇప్పటివరకు పొందిన అధిక పింఛను బకాయిలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర వృద్ధాప్యంలోని ఆ ఉద్యోగికి ఆర్థిక ఇబ్బందులతో రోజువారీ జీవనం కష్టంగా మారింది. బకాయిలంటే తట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: ఇమ్రాన్‌ను సాగనంపాలి.. లేకపోతే మేం పోవాలి: పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
General News
viveka murder case : వివేకా హత్య కేసు ఇంకా ఎంత కాలం విచారిస్తారు?: సీబీఐని ప్రశ్నించిన సుప్రీం
-
India News
Disqualification Petition: అనర్హతపై సుప్రీంకు లక్షద్వీప్ మాజీ ఎంపీ ఫైజల్.. రేపు విచారణ
-
General News
KTR: భాజపా నేతలతో వేదికపై బిల్కిస్‌బానో దోషి.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
-
Movies News
HBD Ram Charan: స్పెషల్ ఫొటో షేర్ చేసిన చిరంజీవి.. గ్లోబల్స్టార్కు వెల్లువలా బర్త్‌డే విషెస్
-
General News
Polavaram: తుది నివేదికకు 3 నెలల సమయం కావాలి: పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ