గణతంత్ర వేడుకల నిర్వహణ లోపాలపై కేంద్రానికి నివేదిక

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించలేదని పేర్కొంటూ గవర్నర్‌ కార్యాలయం గురువారం కేంద్రానికి నివేదికను పంపించింది.

Published : 27 Jan 2023 04:32 IST

రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్‌ హోమ్‌
కార్యక్రమానికి దూరంగా భారాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించలేదని పేర్కొంటూ గవర్నర్‌ కార్యాలయం గురువారం కేంద్రానికి నివేదికను పంపించింది. వేడుకల నిర్వహణపై గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. గురువారం ఏం జరిగిందో అందరికీ తెలుసనీ.. జరిగిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించామని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో గురువారం నిర్వహించిన ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమం అనంతరం ఈ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌(ఎస్‌ఓపీ)’ ఉల్లంఘనపై నివేదిక పంపించినట్లుగా ధ్రువీకరించారు. రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, మాజీ గవర్నర్లు విద్యాసాగర్‌రావు, రామ్మోహన్‌రావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా నేతలు వివేక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాబూమోహన్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాంచందర్‌రావు, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ సహా మంత్రులెవరూ హాజరు కాలేదు. కాంగ్రెస్‌, మజ్లిస్‌, వామపక్ష పార్టీల నుంచి కూడా ఎవరూ పాల్గొనలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని