భక్తజనసంద్రం.. బాసర క్షేత్రం

నిర్మల్‌ జిల్లా బాసరలోని సరస్వతీ క్షేత్రం గురువారం భక్తజనసంద్రంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు తరలి రావడంతో దర్శనాలతోపాటు అక్షరాభ్యాసాల కార్యక్రమం 18 గంటలకు పైగా కొనసాగింది.

Published : 27 Jan 2023 04:29 IST

18 గంటలకు పైగా కొనసాగిన అక్షరాభ్యాసాలు

ఈటీవీ- ఆదిలాబాద్‌, ముథోల్‌- న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా బాసరలోని సరస్వతీ క్షేత్రం గురువారం భక్తజనసంద్రంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు తరలి రావడంతో దర్శనాలతోపాటు అక్షరాభ్యాసాల కార్యక్రమం 18 గంటలకు పైగా కొనసాగింది. వసంత పంచమి, గురువారం కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రికే బాసరలోని విశ్రాంతిగదులు, వందపడకల గదులు నిండిపోవడంతో భక్తులు ఆరుబయటే నిరీక్షించారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆశ్రయం కోసం నిర్మల్‌, నిజామాబాద్‌, భైంసా పట్టణాలకు వెళ్లక తప్పలేదు. గోదావరి సమీపంలోని 8 ఎకరాలతో పాటు ఆలయానికి వెనుకభాగంలో ఉన్న 5 ఎకరాల ఖాళీ స్థలమంతా వాహనాల పార్కింగ్‌తో నిండిపోయింది. ఆలయానికి వెళ్లే మార్గాలన్నీ రద్దీగా మారి తోపులాటకు దారితీసింది. భక్తులకు సరిపడా ప్రసాదాలు సైతం లభించలేదు. అక్షరాభ్యాసాలకు మూడు మండపాలను ఏర్పాటు చేసినా ఒక్కొక్కరి వంతు వచ్చేసరికి రెండు, మూడు గంటల సమయం పట్టింది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం 6,872 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. ఆలయానికి రూ. 60 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు