కానరాని ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు

గ్రామాల్లో దళితులు ఐక్యంగా సాధికారత సాధించేందుకు అవసరమైన సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం నెమ్మదిగా నడుస్తోంది.

Published : 27 Jan 2023 05:04 IST

కాగితాలకే పరిమితమైన నిధుల కేటాయింపు
నేటికీ 15 శాతం భవనాలు పూర్తికాని పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామాల్లో దళితులు ఐక్యంగా సాధికారత సాధించేందుకు అవసరమైన సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం నెమ్మదిగా నడుస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం, నిధుల కొరతతో ఎనిమిదేళ్ల కిందట మంజూరైన భవనాలు నేటికీ పునాది దశను దాటలేదు. గ్రామాల్లో భవనాల నిర్మాణానికి భూమి కొరత వేధిస్తుంటే, భూమిని గుర్తించిన చోట పనులు చేపట్టేందుకు నిధుల్లేకుండా పోయాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ భవనాల కోసం మంజూరు చేసిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చుకాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 914 కమ్యూనిటీహాళ్లు, అంబేడ్కర్‌ భవనాల్లో 137 మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వినియోగానికి అనర్హంగా మారుతున్నాయి. 2014-19 కాలంలో 914 భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో భవనానికి గ్రామాల్లో రూ.7.5 లక్షలు, మండల కేంద్రాల్లో రూ.25 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.50 లక్షలు, జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్‌ భవనాలకు రూ.కోటి చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఏటా బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు పేర్కొంటూ వచ్చింది. క్షేత్రస్థాయిలో భూముల లభ్యతలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు 302 గ్రామాల్లో భూములను ఎస్సీ సంక్షేమశాఖ గుర్తించలేదు. 216 భవనాల పనులు టెండరు దశలో ఉన్నాయి. మరో 259 భవనాల పనులు గోడల వరకు వచ్చి నిలిచిపోయాయి. ఇటీవల ఈ పనులపై ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్‌ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించగా.. ప్రభుత్వం నిధులు ఇవ్వనందున అని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారులు సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యేలను సంప్రదించి పనులు వేగవంతమయ్యేలా చూడాలని సూచించారు.

పెరిగిన ధరలు.. సరిపోని నిధులు

కమ్యూనిటీహాళ్లు, అంబేడ్కర్‌ భవనాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోని పరిస్థితి నెలకొంది. గడిచిన నాలుగేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నిధులు పెంచాలని ఇప్పటికే పలు జిల్లాల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గ్రామాల్లో రూ.15 లక్షలు, మండల కేంద్రాల్లో రూ.50 లక్షలు, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో రూ.కోటి, జిల్లా కేంద్రాల్లోని అంబేడ్కర్‌ భవనాలకు రూ.3 కోట్ల చొప్పున నిధులను కేటాయించాలని కోరారు. కాగా నిర్మాణాలు పూర్తయిన భవనాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు