Adani Stocks: ‘షేక్’ మార్కెట్.. సూచీలకు అదానీ షాక్
నిన్న మొన్నటివరకు మదుపర్లకు లాభాల పంట పండించిన అదానీ షేర్లు... ఒక్కసారిగా భయాందోళనకు గురిచేస్తున్నాయి.
5-20శాతం పతనమైన ఆ గ్రూప్ కంపెనీల షేర్లు
ఆ ప్రభావంతో మూడు నెలల కనిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ
రెండు రోజుల్లో రూ.10.73 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి: నిన్న మొన్నటివరకు మదుపర్లకు లాభాల పంట పండించిన అదానీ షేర్లు... ఒక్కసారిగా భయాందోళనకు గురిచేస్తున్నాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో మార్కెట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. బుధవారం 3-8% వరకు క్షీణించిన ఈ షేర్లు... శుక్రవారం మరో 5-20% వరకు పతనమయ్యాయి. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తమ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నివేదికను విడుదల చేశారని అదానీ గ్రూపు వివరణ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత రెండు ట్రేడింగ్ రోజుల్లో రూ.10.73 లక్షల కోట్లు కోల్పోయి రూ.269.65 లక్షల కోట్లకు పరిమితమైంది. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.4.17 లక్షల కోట్లు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. బ్యాంకింగ్, ఫైనాన్స్, యుటిలిటీస్, చమురు షేర్లు కుదేలవ్వడంతో సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.
విదేశీ మదుపర్ల విక్రయాలు
సాధారణ బడ్జెట్‌కు ముందు విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం కూడా ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 81.53 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.35 శాతం లాభపడి 88.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం... నిన్న ప్రారంభమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) పైనా పడింది. తొలిరోజు మదుపర్ల నుంచి పేలవ స్పందనే లభించింది. సెన్సెక్స్ ఉదయం 60,166.90 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయిన సూచీ.. ఇంట్రాడేలో 58,974.70 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 874.16 పాయింట్ల నష్టంతో 59,330.90 వద్ద ముగిసింది. అక్టోబరు 21 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే కనిష్ఠ స్థాయి. ఇక నిఫ్టీ కూడా 287.60 పాయింట్లు కుదేలై 17,604.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,493.55 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది.
వీటికి లాభాలు...
రెండేళ్లలో తొలిసారిగా త్రైమాసిక లాభాన్ని నమోదుచేయడంతో టాటా మోటార్స్ షేరు దుమ్మురేపింది. ఇంట్రాడేలో 8.16% పరుగులు తీసిన షేరు రూ.453.20 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 6.34% లాభంతో రూ.445.55 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.8,819.46 కోట్లు పెరిగి రూ.1,47,981.46 కోట్లకు చేరింది. ఐటీసీ 1.77%, ఎం అండ్ ఎం 0.71%, సన్‌ఫార్మా 0.35% లాభపడ్డాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆరోగ్య సంరక్షణ, వాహన రాణించాయి. బీఎస్‌ఈలో 2783 షేర్లు నష్టాల్లో ముగియగా, 784 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 91 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
సెన్సెక్స్ 30 షేర్లలో 23 నష్టాల్లోనే...
సెన్సెక్స్ 30 షేర్లలో 23 కుప్పకూలాయి. ఎస్‌బీఐ(5.03%), ఐసీఐసీఐ బ్యాంక్(4.41%), ఇండస్‌ఇండ్ బ్యాంక్(3.43%), యాక్సిస్ బ్యాంక్(2.07%), కోటక్ బ్యాంక్(2.03%), టెక్ మహీంద్రా(1.97%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(1.96%), రిలయన్స్(1.90%), హెచ్‌డీఎఫ్‌సీ(1.87%), ఏషియన్ పెయింట్స్(1.71%), ఇన్ఫోసిస్(1.60%), టైటన్(1.05%) చొప్పున నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్ 7.34%, విద్యుత్ 6.79%, చమురు-గ్యాస్ 5.75%, ఇంధన 5.22%, టెలికాం 3.79%, కమొడిటీస్ 3.27%, బ్యాంకింగ్ 3.06%, ఆర్థిక సేవలు 2.48% క్షీణించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు
-
Crime News
Crime News: శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకుపైగా విదేశీ బంగారం పట్టివేత
-
Movies News
Telugu Movies:ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Ap-top-news News
Andhra News: భూ పరిహారం నొక్కేసిన వైకాపా నేత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
ఇంటర్ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు.. జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు