Jamuna: దివికేగితివా.. అందాల ఓ చిలకా!
జమున... అభినయ లలన. ఆమె రూపం... ముగ్ధ మనోహరం. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో... సత్యభామ అంటే తెలుగువాళ్లకు గుర్తొచ్చేది జమునే.
నటి జమున కన్నుమూత
కథానాయికగా తనదైన ముద్ర
సత్యభామగా గుర్తింపు
రాజకీయాల్లోనూ ప్రవేశం
అనారోగ్యంతో అస్తమయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సంతాపం
జమున... అభినయ లలన.
ఆమె రూపం... ముగ్ధ మనోహరం.
కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో... సత్యభామ అంటే తెలుగువాళ్లకు గుర్తొచ్చేది జమునే.
గడుసుదనం... కొంటెతనంతో కూడిన పాత్రలతో కథానాయికగా తనదైన ముద్ర వేసిన మేటి నటి జమున (86) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 200కిపైగా సినిమాల్లో నటించిన ఆమె అసలు పేరు జానాబాయి. జ్యోతిషుల సూచనతో తల్లిదండ్రులు జమునగా మార్చారు. 1936 ఆగస్టు 30న కర్ణాటకలోని హంపీలో నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించారు జమున. పసుపు, పత్తి తదితర ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారం చేస్తూ శ్రీనివాసరావు తన కుటుంబంతో గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడే జమున విద్యాభ్యాసం కొనసాగింది.
సావిత్రి స్ఫూర్తితో..
సావిత్రిని స్ఫూర్తిగా తీసుకుని నాటకాల్లోకి అడుగుపెట్టిన జమునకు, ఊళ్లోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన సీనియర్ నటులు జగ్గయ్య ప్రోత్సాహం తోడైంది. ‘ఖిల్జీరాజు పతనం’ నాటకంలో కీలక పాత్ర పోషించిన ఆమె... ‘మాభూమి’ నాటకంతో గరికపాటి రాజారావు దృష్టిలో పడ్డారు. ఆయన నిర్మించిన ‘పుట్టిల్లు’ సినిమాతోనే తొలి అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘వద్దంటే డబ్బు’, ‘అంతా మనవాళ్లే’ చిత్రాల్లో రెండో కథానాయికగా నటించిన ఆమె ‘దొంగరాముడు’ చిత్రంలో ఏఎన్నార్‌కు చెల్లెలిగా కనిపించి ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించారు. ‘మిస్సమ్మ’, ‘నిరుపేదలు’ తదితర చిత్రాలతో తిరుగులేని నటిగా నిరూపించుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’, ‘భాగ్యరేఖ’, ‘చిరంజీవులు’ ‘భూకైలాస్’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘ఇల్లరికం’, ‘జల్సారాయుడు’, ‘గులేబకావళి కథ’, ‘గుండమ్మకథ’, ‘పూజాఫలం’, ‘బొబ్బిలియుద్ధం’, ‘మంచి మనిషి’... తదితర చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు.
సత్యభామ పాత్రలతో...
‘వినాయక చవితి’, ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రాల్లో సత్యభామగా ఆమె అభినయం ప్రదర్శించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రెండుసార్లు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని పొందిన జమున... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
రాజకీయాల్లో...
ఇందిరాగాంధీ అంటే ఎంతో ఇష్టపడే జమున... ఆమెనే స్ఫూర్తిగా తీసుకుని 1983లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.1985లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి చెందారు. 1989లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఆమెకు ఓటమి ఎదురైంది. తనకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లభించడం లేదని కొన్నాళ్లు భాజపాలోనూ కొనసాగారు.
తిరుపతిలో వివాహం
జమున 1965లో ప్రొఫెసర్ జూలూరి రమణారావును తిరుపతిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె స్రవంతి ఉన్నారు. వంశీకృష్ణ అమెరికాలో ప్రొఫెసర్‌గా స్థిరపడగా, స్రవంతి హైదరాబాద్‌లో తనయుడితో కలిసి నివసిస్తున్నారు. జమున భర్త జూలూరు రమణారావు 2014లో కన్నుమూశారు.
పలువురి నివాళులు
జమున మృతి వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భౌతిక కాయాన్ని ఆమె నివాసం నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించారు. రెండు చోట్లా వివిధ రంగాల ప్రముఖులు ఆమెకు నివాళులుఅర్పించారు. సాయంత్రం 4 గంటల సమయంలో జమున అంతిమయాత్ర ప్రారంభమైంది. వాహనంలోకి జమున భౌతికకాయాన్ని తరలించే క్రమంలో సినీ నటుడు మురళీమోహన్ పాడె మోశారు. మహాప్రస్థానంలోని మోక్షస్థల్ దహన వాటికలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అమెరికా నుంచి కుమారుడు రావటానికి సమయం పట్టనుండటంతో చితికి కుమార్తె స్రవంతి నిప్పంటించారు.
జమున మృతి తీరనిలోటు
ప్రముఖ సినీనటి జమున మృతి సినీ పరిశ్రమలకు తీరనిలోటని తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగువారి అభిమానతారగా ఆమె వెలుగొందారని ఆయన గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీపీఐ, సీపీం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, ఇతర నేతలు జమున మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు.
ఈనాడు, హైదరాబాద్-న్యూస్‌టుడే, బంజారాహిల్స్ ఫిలింనగర్, రాయదుర్గం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగమార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్