ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు

‘మధ్యాహ్నం 12 గంటల లోపు పార్సిల్‌ బుక్‌ చేస్తే రాత్రి 9 గంటలకు గమ్యస్థానానికి చేరుస్తాం. రాత్రి 9 గంటలలోపు బుక్‌ చేసుకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా చేరవేస్తాం.

Published : 28 Jan 2023 05:05 IST

‘ఏఎం 2 పీఎం’ పేరిట నూతన సేవలు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ‘మధ్యాహ్నం 12 గంటల లోపు పార్సిల్‌ బుక్‌ చేస్తే రాత్రి 9 గంటలకు గమ్యస్థానానికి చేరుస్తాం. రాత్రి 9 గంటలలోపు బుక్‌ చేసుకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా చేరవేస్తాం. ‘ఏఎం 2 పీఎం’ పేరుతో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసులను ప్రారంభించాం. తెలంగాణలో 99 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. త్వరలో ఇతరరాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సర్వీసులను ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుతానికి ఒక కిలో బరువు ఉన్న పార్సిళ్లను మాత్రమే అనుమతిస్తాం. ఆ పార్సిల్‌ విలువ కూడా రూ.5 వేలకు మించి ఉండకూడదు. ఒక్కో పార్సిల్‌కు రూ.99 వసూలు చేస్తాం. తిరుపతి, బెంగళూరు, కర్నూలు, విజయవాడ నగరాలకు అయిదు కిలోల బరువున్న పార్సిళ్లను చేరవేస్తాం.పార్సిళ్లు గమ్యస్థానాలకు చేరిన తర్వాత బుక్‌చేసిన వారికి, తీసుకోవాల్సిన వారికి సంక్షిప్త సందేశాలు పంపిస్తాం. ఏజెంట్ల వ్యవస్థను విస్తరిస్తాం. ఈ-కామర్స్‌ సంస్థలతో చర్చలు నిర్వహించి టైర్‌-3 నగరాలకు కార్గో సేవలను విస్తరించాలని యోచిస్తున్నాం.

రూ. వంద కోట్ల ఆదాయమే లక్ష్యం

టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికి 37.21 లక్షల పార్సిళ్లను బట్వాడా చేశాం. ఈఏడాది ఇప్పటివరకు రూ.68 కోట్ల ఆదాయం లభించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలన్నది లక్ష్యం. ఇంకా జీవా మినరల్‌ వాటర్‌, పెట్రోలు బంకులు, కార్గో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. పార్సిల్‌ సేవల సమాచారం కోసం 91546 80020 నంబరుకు ఫోన్‌ చేసి లేదా www.tsrtcparcel.in ద్వారా తెలుసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీస్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు