స్టార్టప్‌లకు ప్రత్యేక అంతర్జాతీయ వేదిక

స్టార్టప్‌ల కోసం జీ-20 సభ్యదేశాలన్నీ కలిసి ఒకేవేదికపై వచ్చి గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో జీ-20 స్టార్టప్‌ ఆరంభ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని జీ-20 భారతదేశ ప్రతినిధి, నీతిఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌కాంత్‌ తెలిపారు.

Published : 28 Jan 2023 05:05 IST

జీ-20 స్టార్టప్‌ సమావేశాల్లో ఎజెండా
నేడు, రేపు హైదరాబాద్‌లో ఆరంభ సమావేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్టార్టప్‌ల కోసం జీ-20 సభ్యదేశాలన్నీ కలిసి ఒకేవేదికపై వచ్చి గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో జీ-20 స్టార్టప్‌ ఆరంభ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని జీ-20 భారతదేశ ప్రతినిధి, నీతిఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌కాంత్‌ తెలిపారు. స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంతో పాటు కార్పొరేట్లు, పెట్టుబడుదారులు, ఆవిష్కరణ వ్యవస్థల సమన్వయంతో అంతర్జాతీయ స్టార్టప్‌ వ్యవస్థను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌ నేతృత్వంలో జరగనున్న జీ20 సమావేశాల్లో భాగంగా తొలిసారిగా స్టార్టప్‌-20 గ్రూపును ప్రారంభించినట్లు వెల్లడించారు.ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఆరంభ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో జీ-20 దేశాలు, 9 పరిశీలక దేశాలకు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్‌లు, పెట్టుబడిదారులు, పరిశ్రమ భాగస్వాములు తదితరులు హాజరుకానున్నారు. జులైలో గుడ్‌గావ్‌లో స్టార్టప్‌ సదస్సు సమావేశాలు ముగుస్తాయని వివరించారు.

మార్గదర్శకాల రూపకల్పనకు వేదిక

స్టార్టప్‌ 20 సమావేశాల ఎజెండా వివరాలను కేంద్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌, స్టార్టప్‌ 20 అధ్యక్షుడు డాక్టర్‌ చింతన్‌వైష్ణవ్‌తో కలిసి అమితాబ్‌కాంత్‌ వెల్లడించారు. ‘‘స్టార్టప్‌లకు ఎదురయ్యే సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడంతో పాటు ఆర్థిక సహకారం, ఉపాధి అవకాశాల     పెంపు తదితర అంశాలతో మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ఈ సమావేశం వేదిక అవుతుంది. వివిధ దేశాల్లోని స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ సహకారం లభిస్తుంది. స్టార్టప్‌లకు వేగంగా ఆర్థిక సహకారం అందించేందుకు దోహదం చేస్తుంది. ప్రభుత్వ నియంత్రణలు, నిధుల లభ్యత, పరిపాలన అడ్డంకులను ఈ సమావేశం చర్చిస్తుంది. అన్నిదేశాల స్టార్టప్‌ల మధ్య సంబంధాలు నెలకొల్పేందుకు దోహదం చేస్తుంది. ప్రతినిధులు తాజ్‌ఫలక్‌నుమా, గోల్కొండకోటతో పాటు హైదరాబాద్‌లోని టీహబ్‌ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా టీ-హబ్‌లో 50 వరకు స్టార్టప్‌ల ప్రదర్శన ఉంటుంది.’’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని