జిల్లా కోర్టులు, న్యాయ కళాశాలల్లో తెలుగు ప్రవేశపెట్టాలి

ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లా కోర్టుల్లో తెలుగును ప్రవేశపెట్టాలని, అదేవిధంగా న్యాయ కళాశాలల్లో తెలుగులో బోధన జరిగేలా చూడాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ సూచించారు.

Published : 28 Jan 2023 05:05 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లా కోర్టుల్లో తెలుగును ప్రవేశపెట్టాలని, అదేవిధంగా న్యాయ కళాశాలల్లో తెలుగులో బోధన జరిగేలా చూడాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ సూచించారు. తెలుగు న్యాయ కళాశాలలను ప్రారంభించాల్సిన అవసరంలేదని, అయితే తెలుగులో పాఠాలను బోధిస్తే ఆసక్తి ఉన్న విద్యార్థులు దాన్ని ఎంపిక చేసుకోవచ్చన్నారు. దీని ద్వారా తీర్పులను తెలుగులో అనువాదం చేయడానికి, చట్టాలను అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ‘బార్‌ అండ్‌ బెంచ్‌ ముందు విస్తరిస్తున్న సవాళ్లు’ అనే అంశంపై బార్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ ప్రసంగించారు. కింది కోర్టుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కక్షిదారును దూరంగా ఉంచడం సరికాదన్నారు. వృత్తిపరమైన స్వతంత్రత, గుర్తింపు, ప్రత్యామ్నాయం, వికేంద్రీకరణ తదితర అంశాలపై న్యాయవాదులు దృష్టి సారించాలన్నారు. గతంలో సీనియర్‌ న్యాయవాది పద్మనాభరెడ్డి వద్దకు బెయిలు కోసం పెద్ద కేసు వచ్చిందని, ఎక్కువ ఫీజు తీసుకోవాలని జూనియర్‌ న్యాయవాది చెప్పగా.. బెయిలుకు ఇంతే మొత్తాన్ని తీసుకుంటానన్నారని.. స్వతంత్రత అంటే అదే అన్నారు. తద్వారా గుర్తింపు, గౌరవం వస్తాయన్నారు. 33 ఏళ్లు న్యాయవాదిగా, 18 నెలల నుంచి న్యాయమూర్తిగా పనిచేస్తున్నానని, రెండింటికీ తేడా లేదన్నారు. బార్‌ అండ్‌ బెంచ్‌ ముందు పలు సవాళ్లు ఉన్నాయని, దీన్ని అత్యయిక పరిస్థితిలా భావించి ఎదుర్కోవాలన్నారు. ఎక్కడో ఆదిలాబాద్‌ జిల్లాలో ఎమ్మార్వో చేసిన దానికి హైదరాబాద్‌ వరకు ఎందుకు రావాలని, ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా జిల్లా కోర్టులు చూసేలా మార్పులు అవసరమని పేర్కొన్నారు. విడాకుల కేసులో 25 ఏళ్లు, సోదరుల మధ్య ఆస్తి వివాద పరిష్కారానికి 10-15 ఏళ్లు పడుతోందని, సమస్య పరిష్కారానికి  కోర్టుకు వచ్చిన వారు శత్రువులుగా మారుతున్నారన్నారు. ప్రాథమికంగా వ్యవస్థలో తప్పు జరుగుతోందని, ఇది గత 70 ఏళ్లుగా ఉందన్నారు. మధ్యవర్తిత్వం వంటి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు చూడాలన్నారు.

ఈ కోర్టు ఆవరణలోనే పుట్టాను

ప్రస్తుతం కోర్టు పార్కింగ్‌గా ఉన్న జడ్జీఖానా ఆసుపత్రిలో పుట్టానని, అందువల్ల ఈ కోర్టుతో అందరికంటే ఎక్కువ అనుబంధం తనకే ఉందని జస్టిస్‌ నరసింహ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ నల్సార్‌ వీసీ ప్రొఫెసర్‌ శ్రీకృష్ణదేవరావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని