‘అక్షర’సిరికి ప్రధాని భాషోపదేశం

మాతృభాషతోపాటు ఇతర భాషలను ఎలా నేర్చుకోవాలి. వాటిపై పట్టు సాధించడం ఎలా? అని హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జవహర్‌ నవోదయలో 9వ తరగతి చదువుతున్న అక్షరసిరి ప్రధాని మోదీని ప్రశ్నించింది.

Published : 28 Jan 2023 05:32 IST

ఇతర భాషలు ఎలా నేర్చుకోవాలో తొమ్మిదో తరగతి విద్యార్థినికి వివరించిన మోదీ

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, గచ్చిబౌలి: మాతృభాషతోపాటు ఇతర భాషలను ఎలా నేర్చుకోవాలి. వాటిపై పట్టు సాధించడం ఎలా? అని హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జవహర్‌ నవోదయలో 9వ తరగతి చదువుతున్న అక్షరసిరి ప్రధాని మోదీని ప్రశ్నించింది. పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మోదీ శుక్రవారం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో అక్షరసిరి ఈ ప్రశ్న అడగ్గా.. ప్రధాని సమాధానమిచ్చారు. ‘‘భారత్‌ వైవిధ్యంతో నిండిన దేశం. మన దగ్గర వందలభాషలు, వేల యాసలు ఉన్నాయి. ఎప్పుడైనా విదేశీయులు నమస్తే అని చెబితే మన చెవులు రిక్కించుకుంటాయి. ఇంత పెద్దదేశంలో ఉన్న మనం ఆసక్తితో సంగీత వాయిద్యాలను నేర్చుకోవాలని అనుకుంటాం. అదే సమయంలో ఇతర రాష్ట్రాల భాషలు నేర్చుకుంటే నష్టమేంటి? అందుకోసం ప్రయత్నించాలి. తమిళం ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష అని గర్వంగా చెప్పాలి. అందుకే నేను గతంలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించినప్పుడు తమిళంలో కొన్ని విషయాలు చెప్పాను. ప్రతి ఒక్కరూ మాతృభాషతో పాటు ఏదో ఒక ఇతర భారతీయభాష నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కనీసం రెండు వాక్యాలనైనా ఎదుటివారి మాతృభాషలో మాట్లాడితే వారి సొంత మనిషైపోతారు. అహ్మదాబాద్‌లో ఒక కార్మిక కుటుంబం ఉండేది. అక్కడ ఓ పాప ఎన్నో భాషల్లో మాట్లాడేది. ఆమె తల్లిది కేరళ, తండ్రి బెంగాల్‌. చుట్టుపక్కల వారికోసం హిందీ మాట్లాడేవారు. ఇంటిపక్కన మరాఠీవారు ఉండేవారు. స్కూల్లో గుజరాతీ నడిచేది. 8-10 ఏళ్ల బాలిక ఇన్ని భాషలు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యమేసేది. అందువల్ల మనం భాషా వారసత్వాన్ని చూసి గర్వించాలి. సాధ్యమైనన్ని నేర్చుకోవాలి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

మోదీ విద్యార్థుల పక్షపాతి: జి.కిషన్‌రెడ్డి

బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌-న్యూస్‌టుడే: పరీక్షా పే చర్చా కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక హైదరాబాద్‌లోని మెరీడియన్‌ స్కూల్‌కు, సనత్‌నగర్‌లోని హిందూ పబ్లిక్‌ స్కూల్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌లు హిందూ పబ్లిక్‌ స్కూల్‌కు హాజరయ్యారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీ విద్యార్థుల పక్షపాతి. పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు నేరుగా మాట్లాడుతున్నారు. మేం 6 కిలోమీటర్లు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. నేలమీదే కూర్చుని పాఠాలు విన్నాం. మరో పాతికేళ్లకు 100 సంవత్సరాల స్వతంత్ర భారత్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష’’ అని అన్నారు.

ర్యాంకుల కోసం పోటీ వద్దు: సంజయ్‌

‘‘ర్యాంకులు సాధించడానికి కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు విద్యార్థులను రాచి రంపాన పెడుతున్నాయి. మరికొన్ని పాఠశాలలైతే ర్యాంకులను కొంటున్నాయి. సామాజిక స్పృహ, విజ్ఞానం లేని విద్యలో మొదటి ర్యాంకు వచ్చినా అవసరం లేదు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికే ‘పరీక్షా పే చర్చ’ మోదీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 600 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’’ అని సంజయ్‌ అన్నారు. ‘‘విద్యార్థుల ఆలోచన, ఆసక్తిని గుర్తించి.. వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి’’ అని భాజపా తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ అన్నారు.


లక్ష్మీప్రియకు ప్రధాని ప్రశంసలు

వరంగల్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఓరుగల్లుకు చెందిన నృత్యకారిణి లక్ష్మీప్రియ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులతో ఏటా నిర్వహించే పరీక్ష పే చర్చా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దిల్లీలోని తాల్కతోర స్టేడియంలో మోదీ ఎదుట లక్ష్మీప్రియ నృత్య ప్రదర్శన చేసింది. మండల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు నిర్వహించిన కళోత్సవ్‌ పోటీల్లో ప్రతిభ చూపిన ఆమెకు అవకాశం దక్కింది. ఈమె నృత్య ప్రదర్శనకు మంత్రముగ్ధులై మోదీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని