రూ.3,359 కోట్ల కోసం ఎదురుచూపులు

రైతు సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో నిధులు భారీగా పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది.

Published : 29 Jan 2023 04:26 IST

సేద్యానికి  2022-23 బడ్జెట్‌ కేటాయింపులు రూ.22,139 కోట్లు  
విడుదలైంది రూ.18,780 కోట్లు
ఇంకా రెండు నెలలే గడువు
వచ్చే బడ్జెట్‌ ప్రతిపాదనలు రూ.24,467 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రైతు సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో నిధులు భారీగా పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ప్రస్తుత ఏడాది(2022-23) బడ్జెట్‌లో రూ.22,139.71 కోట్లు కేటాయించగా రూ.18,780 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.3,359 కోట్లు విడుదల కావాల్సి ఉంది. వచ్చే మార్చి 31లోగా వీటిని విడుదల చేస్తేనే వివిధ సంక్షేమ పథకాల కింద రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. రైతుబంధు, రుణమాఫీ, వ్యవసాయ యంత్రాలు, రైతువేదికలు, మార్కెట్‌ జోక్యం నిధి తదితర రాష్ట్ర పథకాలకు ఇంకా కొన్ని నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్‌) కింద ప్రస్తుత ఏడాదికి రూ.528.17 కోట్లు కేటాయించగా వీటిలో సగానికి పైగా విడుదల కాలేదు. రాష్ట్ర వాటా 40 శాతం నిధులను విడుదల చేస్తేనే తాము ఇచ్చే 60 శాతం ఇస్తామని కేంద్రం షరతులు పెట్టడంతో ఈ పథకాలు రైతులకు అందడం లేదు. ఉదాహరణకు భూసార పరీక్షలు చేసి రైతులకు వాటి ఫలితాల కార్డులను ఇచ్చేందుకు ‘నేషనల్‌ ప్రాజెక్టు ఆన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ సాయిల్‌ హెల్త్‌ అండ్‌ ఫెర్టిలిటీ’ అనే పేరుతో అమలుచేస్తున్న కార్యక్రమానికి ఈ ఏడాది రూ.71.65 కోట్లను సీఎస్‌ఎస్‌ కింద కేటాయించారు. వీటిలో 40 శాతం రాష్ట్రం, 60 శాతం కేంద్రం విడుదల చేయాలి. ఈ నిధులు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన’(ఆర్కేవీవై) పేరుతో కేంద్రం అమలుచేసే పథకం కింద వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్‌, పశుసంవర్ధకం, విశ్వవిద్యాలయాలు తదితర వ్యవసాయ అనుబంధ విభాగాలన్నింటికీ కలిపి ఈ ఏడాది రూ.334.52 కోట్లు సీఎస్‌ఎస్‌ పద్దు కింద కేటాయించారు. ఈ నిధులూ పూర్తిగా విడుదల కాలేదు. వచ్చే ఏడాది(2023-24)లో కూడా ఇంతే మొత్తంలో రూ.334.52 కోట్లను ఆర్కేవీవై పథకం కింద కేటాయించాలని తాజాగా ప్రతిపాదనలు పంపారు.

వచ్చే ఏడాదికి భారీగా పెంచాలి

త్వరలో రాష్ట్ర బడ్జెట్‌లో రూ.24,467.11 కోట్లను కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గతేడాదికన్నా రూ.2,328 కోట్లు పెంచాలని ప్రతిపాదనల్లో కోరారు. రైతుబంధు పథకానికి రూ.15,075 కోట్లు, పంటరుణమాఫీకి రూ.6,389 కోట్లు, రైతుబీమాకి రూ.1,589 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.500 కోట్లు, పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనే మార్కెట్‌ జోక్యం పథకానికి రూ.100 కోట్లు, పంటలబీమా పథకానికి రూ.196 కోట్లు కావాలని కోరారు. ఇవి కాక పలు చిన్నచిన్న కార్యక్రమాలకు మరికొన్ని నిధులు అడిగారు. మరోపక్క గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2018 డిసెంబరు 11 వరకూ రూ.లక్ష లోపు బాకీ ఉన్న రైతులందరి పంటరుణాలను మాఫీ చేస్తామని నాడు తెరాస(భారాస) హామీ ఇచ్చింది. ఈ పథకం కింద ఇంకా దాదాపు రూ.18 వేల కోట్లు బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్‌లో ఆ మేరకు కేటాయించి పంటరుణాలన్నీ మాఫీ చేస్తారా? అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని