తొలిరోజు 20 వేల బదిలీ దరఖాస్తులు

బదిలీలు కోరుతూ తొలిరోజు శనివారం సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

Published : 29 Jan 2023 03:12 IST

పరస్పర, సచివాలయ బదిలీలకు జీరో సర్వీస్‌
ప్రధానోపాధ్యాయుల స్పౌస్‌ బదిలీలకూ అనుమతి
ముంపు గ్రామాల్లోని ఉపాధ్యాయులకు 10 అదనపు పాయింట్లు

ఈనాడు, హైదరాబాద్‌: బదిలీలు కోరుతూ తొలిరోజు శనివారం సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. శనివారం రాత్రి 10 గంటల వరకు 20 వేల దరఖాస్తులు అందాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. తప్పనిసరి బదిలీలకు 25 వేల మంది ఉన్నారు. అంటేవారు దరఖాస్తు చేసుకోకున్నా ఎక్కడో ఒకచోటుకు వెళ్లాలి. అంతేకాకుండా ఐచ్ఛిక బదిలీకి మరో 25 వేల మంది ముందుకు వస్తారని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అంటే మొత్తం 50 వేల మందికి బదిలీలు జరుగుతాయని భావిస్తున్నారు. తొలుత దరఖాస్తుల్లో ఆయా వివరాలను నింపడంపై పలు సందేహాలు తలెత్తాయి. వెబ్‌సైట్‌ కూడా మొరాయించింది. దానివల్ల దరఖాస్తుల ప్రక్రియ మధ్యాహ్నం 3 వరకు మందకొడిగా సాగిందని, తర్వాత ఊపందుకుందని ఉపాధ్యాయులు తెలిపారు.

వారు కొత్తగా కొలువులో చేరినట్లే

* గత మార్చిలో పరస్పర బదిలీలు పొందిన 2,800 మందితో పాటు తాజాగా సచివాలయ బదిలీలైన వారికి జీరో సర్వీస్‌ ఇస్తారు. అంటే వారికి ఇంతకుముందు ఉన్న సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోరు. వారు కొత్తగా ఉద్యోగంలో చేరినట్లే. సచివాలయ బదిలీలు 70 వరకు ఉంటాయని చెబుతున్నారు.

* స్పౌస్‌ విభాగంలో ఆరుగురు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులను మల్టీ జోన్‌-1 నుంచి మల్టీ జోన్‌-2కు బదిలీ చేశారు. ఆ దరఖాస్తులు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నాయి. అంతే సంఖ్యలో మల్టీ జోన్‌-2 నుంచి మల్టీ జోన్‌-1కి కొద్దిరోజుల కిందట బదిలీ అయ్యారు.

* సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ సాగర్‌, అనంతగిరి సాగర్‌ రిజర్వాయర్లలో 20 పాఠశాలలు మునిగిపోయాయి. ఇతర ప్రాంతాల్లో బడులు ప్రారంభించారు. ముంపు గ్రామాల పరిధిలో పనిచేస్తూ.. ఎనిమిదేళ్ల స్టేషన్‌ సర్వీస్‌ నిండని ఉపాధ్యాయులకు బదిలీల్లో 10 అదనపు పాయింట్లు కేటాయించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటుచేసిన బడుల్లో అవసరమైన వాటికంటే ఎక్కువ పోస్టులుంటే హేతుబద్ధీకరణ నిబంధనలను అనుసరించి ఇతర పాఠశాలలకు తరలించడానికి అనుమతిచ్చింది.

* కొత్త జిల్లాల వారీగా గతేడాది ఉపాధ్యాయులను కేటాయించిన సమయంలో జిల్లా మారిన వారికి గత పాఠశాలలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న తెలిపారు. దానివల్ల తమకు బదిలీ దరఖాస్తుకు అవకాశం లేకుండా పోయిందని, న్యాయం చేయాలని సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని