‘సీనియర్‌’ పదోన్నతుల్లో ఎందుకంత జాప్యం?

ఆచార్యులు సీనియర్‌ ఆచార్యులుగా పదోన్నతి పొందేందుకు ముఖాముఖి పూర్తయ్యి నాలుగు నెలలు గడిచింది... పదోన్నతులు ఇచ్చేందుకు విశ్వవిద్యాలయం పాలకమండలి(ఈసీ) ఆమోదించి మరో వారంతో మూడు నెలలవుతుంది.

Updated : 29 Jan 2023 04:25 IST

32 మంది అర్హుల్లో విడతలవారీగా 20 మంది ఆచార్యులకే స్థాయి పెంపు
మిగిలిన వారిపై ఎటూ తేల్చని జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్యులు సీనియర్‌ ఆచార్యులుగా పదోన్నతి పొందేందుకు ముఖాముఖి పూర్తయ్యి నాలుగు నెలలు గడిచింది... పదోన్నతులు ఇచ్చేందుకు విశ్వవిద్యాలయం పాలకమండలి(ఈసీ) ఆమోదించి మరో వారంతో మూడు నెలలవుతుంది. సాధారణంగా ఈసీ పచ్చజెండా ఊపిన తర్వాత ఏ వర్సిటీనైనా కొద్ది రోజుల్లోనే లిఖిత పూర్వక ఉత్తర్వులు అందజేస్తుంది. జేఎన్‌టీయూహెచ్‌లో మాత్రం దానికి నెలల తరబడి సమయం పడుతుంది. వర్సిటీ ఈసీ ఆమోదించిన 32 మందిలో 20 మందికి మాత్రమే సీనియర్‌ ఆచార్యులుగా పదోన్నతి ఆర్డర్లు అందాయి. అదీ విడతల వారీగా ఇస్తున్నారు. ఇంకా 12 మందికి ఎప్పుడు ఉత్తర్వులు అందుతాయో తెలియని పరిస్థితి. సీనియర్‌ ఆచార్యులుగా పదోన్నతి పొందాలంటే ప్రధానంగా పరిశోధననే కొలమానంగా తీసుకుంటారని, పెద్దగా వివరాలను పరిశీలించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఉత్తర్వులు అందుకోని వారిలో పరిశోధనలో మంచి పేరున్న వారు,  పలు కమిటీల్లో సభ్యులుగా పనిచేసిన...చేస్తున్న వారూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారన్న ప్రచారం వర్సిటీలో సాగుతోంది. పదోన్నతి పొందాల్సిన వారిలో కొందరు మరికొద్ది నెలల్లో పదవీ విరమణ పొందుతున్నారు. ఆలోపు వారికి ఉత్తర్వులు అందుతాయా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. పదోన్నతుల్లో జాప్యంపై ఉపకులపతి నర్సింహారెడ్డిని ‘ఈనాడు’ వివరణ కోరగా పరిశీలన కొనసాగుతోందన్నారు. దీనిపై జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఆచార్య మంజూర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు 20 మందికి పదోన్నతి ఇచ్చామని.. వీసీ పరిశీలన పూర్తయిన తర్వాత మిగిలిన వారికి ఉత్తర్వులు అందజేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని