ఈడీ అనుబంధ ఛార్జిషీట్‌ పరిగణనపై 2న విచారణ

దిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను దిల్లీ రౌస్‌అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి రెండో తేదీకి వాయిదా వేసింది.

Updated : 29 Jan 2023 04:18 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను దిల్లీ రౌస్‌అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి రెండో తేదీకి వాయిదా వేసింది. ఈ కుంభకోణంలో నగదు అక్రమ చలామణీ వ్యతిరేక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద జనవరి ఆరో తేదీన 13,567 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను, 428 పేజీలతో సారాంశాన్ని ప్రత్యేక న్యాయస్థానానికి ఈడీ సమర్పించింది. అనుబంధ ఛార్జిషీట్‌లో అరబిందో శరత్‌చంద్రారెడ్డి, హైదరాబాద్‌ వ్యాపారి బోయినపల్లి అభిషేక్‌, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జి విజయ్‌ నాయర్‌, పెర్నాడో రికార్డ్‌ ప్రతినిధి బినోయ్‌ బాబు, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా సన్నిహితుడు అమిత్‌ అరోడాతో పాటు ఏడు కంపెనీలను చేర్చినట్లు నాడు ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసును ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్‌ తాజాగా శనివారం విచారించారు. అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై ఫిబ్రవరి రెండో తేదీన విచారణ చేపడతామంటూ పేర్కొంటూ.. వాయిదా వేశారు.

సమీర్‌ మహేంద్రు వాదనలు పరిగణనలోకి..

మద్యం కేసులో తమ కంపెనీ వ్యవహారాలు, మెయిళ్లలోని సమాచారాన్ని బహిర్గతం చేయొద్దని ఏ1 నిందితుడు సమీర్‌ మహేంద్రు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్‌ విచారణ చేపట్టారు. ఈడీ ఛార్జిషీట్‌లోని సమాచారం బయటకు వెళ్తే తమ వ్యాపారాలు, భాగస్వాములకు నష్టం వాటిల్లుతుందన్న సమీర్‌ మహేంద్రు తరఫు న్యాయవాదుల వాదనలను ప్రత్యేక న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ఛార్జిషీట్‌లోని అంశాలను బహిర్గతం చేయకూడదని ఈడీని ఆదేశించారు. అదే సమయంలో ఏ1గా ఉన్న నిందితుడు సమీర్‌ మహేంద్రును తిహాడ్‌ సెంట్రల్‌ జైలు-7కు బదులు సెంట్రల్‌ జైలు-4కు మార్చడంపై జైలు సూపరింటెండెంట్‌ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేదని ప్రత్యేక న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం కేసులో నిందితులుగా ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌చంద్రారెడ్డి, విజయ్‌ నాయర్‌, బోయినపల్లి అభిషేక్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోడా సెంట్రల్‌ జైలు-7లోనే ఉండాలని, ఒకవేళ వారు అక్కడ లేకపోతే ఎందుకు లేరు? ఏ జైళ్లలో ఉన్నారు? ఏ నిబంధనల ప్రకారం వారిని ఇతర జైళ్లకు మార్చారనే దానిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30న జైలు డీఎస్పీ లేదా ఏఎస్పీ హోదాకు తగ్గని అధికారి కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని