ఇక సులువుగా వాహన సామర్థ్య పరీక్షలు

వాహనాల సామర్థ్య పరీక్ష ఇక నుంచి ఆధునిక పరిజ్ఞానం ద్వారా సులువు కానుంది. కొన్నేళ్లుగా నిలిచిపోయిన వాహన సామర్థ్య పరీక్ష కేంద్ర నిర్మాణం త్వరలో పూర్తవనుండడమే దీనికి కారణం.

Published : 29 Jan 2023 04:22 IST

కోర్టు స్టే ఎత్తి వేయడంతో త్వరలో పరీక్ష కేంద్ర నిర్మాణ పనుల పునరుద్ధరణ
ఈనాడు, హైదరాబాద్‌

వాహనాల సామర్థ్య పరీక్ష ఇక నుంచి ఆధునిక పరిజ్ఞానం ద్వారా సులువు కానుంది. కొన్నేళ్లుగా నిలిచిపోయిన వాహన సామర్థ్య పరీక్ష కేంద్ర నిర్మాణం త్వరలో పూర్తవనుండడమే దీనికి కారణం. వాణిజ్య వాహనాలకు ఏటా సామర్థ్య (ఫిట్‌నెస్‌) పరీక్షలు నిర్వహించాలి. ప్రస్తుతం సంప్రదాయ విధానంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆధునిక విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు తనిఖీ, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.14.40 కోట్ల మంజూరు చేసింది. ఆ కేంద్రాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని మల్కాపూర్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించి 2015 జూన్‌లో శంకుస్థాపన చేసింది. నిర్మాణం తుది దశకు చేరుకున్న తరుణంలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఇవ్వడంతో నిర్మాణం నిలిచిపోయింది. తాజాగా న్యాయస్థానం ఆ స్టే ఉత్తర్వులను ఎత్తివేయడంతో నిలిచిపోయిన పనులు చేపట్టేందుకు అధికారులు గుత్తేదారుతో చర్చిస్తున్నారు.


నాలుగు ట్రాక్‌ల ద్వారా

ఫిటెనెస్‌ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన సివిల్‌ పనుల్లో అధికభాగం ఇప్పటికే పూర్తయ్యాయి. వాహనాల తనిఖీకి సంబంధించిన నాలుగు ట్రాక్స్‌ నిర్మాణంతో పాటు ట్రాక్‌ కింది భాగంలో ఆధునిక యంత్రాలను అమర్చాల్సి ఉంది. రెండు వరుసలు లైట్‌ మోటార్‌ వాహనాలకు, మరో రెండు లైన్లు భారీ వాహనాలకు పరీక్షలు నిర్వహించాలన్నది ప్రణాళిక. వీటి ఏర్పాటుకు అయిదు నెలలు పడుతుందన్నది అంచనా. ఆ ట్రాక్‌పై వాహనాన్ని నిలిపితే బ్రేకుల సామర్థ్యంతో పాటు స్టీరింగ్‌, వీల్స్‌ తదితర పరికరాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్నది ఆధునిక వ్యవస్థ గుర్తిస్తుంది. ఆ పరీక్షలో వాహనం పాస్‌ అయింది? లేనిది కంప్యూటర్‌ వ్యవస్థ స్పష్టం చేస్తుంది. పరీక్షల్లో పాస్‌ అయితేనే ప్రయాణాలకు అనుమతిస్తారు. ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాల్సిన వాహనాలు రాష్ట్రంలో ఏటా సుమారు పది నుంచి పన్నెండు లక్షల వరకు ఉన్నాయి. ఆధునిక వ్యవస్థ ద్వారా సగటున రోజుకు వెయ్యి వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత త్వరితంగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని