ప్రధాన శాఖ... జవాబుదారీ లేక..

ప్రభుత్వ పరిపాలన వ్యవస్థకు గుండెకాయ వంటి రెవెన్యూశాఖలో వివిధ దస్త్రాలు కొండలా పేరుకుపోతున్నాయి.

Published : 30 Jan 2023 04:57 IST

రెవెన్యూలో పెండింగు జాబితా   చాంతాడంత
ఇన్‌ఛార్జి చేతుల్లోనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ పోస్టులు
పేరుకుపోతున్న ధరణి అర్జీలు.. ఉద్యోగుల విజ్ఞప్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పరిపాలన వ్యవస్థకు గుండెకాయ వంటి రెవెన్యూశాఖలో వివిధ దస్త్రాలు కొండలా పేరుకుపోతున్నాయి. 21 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, 71 లక్షల భూముల ఖాతాలు, 30 వేల మంది సిబ్బంది, ప్రభుత్వ పాలన వంటి కీలక కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన ఈ శాఖ చేష్టలుడిగిపోతోందన్న విమర్శలొస్తున్నాయి. అనేక సమస్యలు.. చిక్కుముడులతో ఉన్న రెవెన్యూశాఖ ప్రక్షాళనను ప్రారంభించిన ప్రభుత్వం.. కీలకపోస్టులను ఇన్‌ఛార్జులతో కొనసాగిస్తుండటంతో సమస్యలు సకాలంలో పరిష్కారం కావడంలేదు. ఇటీవలి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా పనిచేసిన సోమేశ్‌కుమార్‌ ఆ పదవిలోకి రాకముందు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించేవారు. దాంతోపాటు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) బాధ్యతలు కూడా ఆయనే నిర్వహించారు. సీఎస్‌ అయ్యాక కూడా ఆ రెండు బాధ్యతలు ఆయన పరిధిలోనే ఉండిపోయాయి. సోమేశ్‌కుమార్‌కు ముందు కూడా సీసీఎల్‌ఏ పోస్టు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చేతుల్లోనే ఉండేది. సీఎస్‌ తర్వాత ప్రాధాన్యం కలిగిన సీసీఎల్‌ఏ పోస్టులో ఆరేళ్లుగా ప్రత్యేకంగా ఎవరినీ నియమించకపోవడం పెండింగుకు ప్రధాన కారణమని రెవెన్యూవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇటీవల సోమేశ్‌కుమార్‌ స్థానంలో శాంతికుమారి సీఎస్‌గా నియమితులయ్యారు. కానీ ఆయన నిర్వర్తించిన రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. భూపరిపాలన విభాగంలో ప్రత్యేకాధికారిణిగా ఉన్న ఐఏఎస్‌ సత్యశారదకు సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ పోస్టును అదనపు బాధ్యతలతో అప్పగించి నెట్టుకొస్తున్నారు.


కీలక సమస్యలివిగో...

* 2017-18లో దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా.. వివాదాలున్న భూములుగా గుర్తించిన 11 లక్షల ఎకరాలకు స్పష్టత తీసుకురావాల్సి ఉంది. దాదాపు అయిదు లక్షల మంది రైతులు వివిధ భూ సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

* ధరణి పోర్టల్‌ను 2020 నవంబరు రెండో తేదీన ప్రారంభించారు. సేవలు ప్రారంభమయ్యాక లోపాలను గుర్తించి సరిచేస్తున్నారు. ఇంకా 3.5 లక్షల ఖాతాలపై అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో గత ఏడాది పైలెట్‌ ప్రాజెక్టు కింద సమస్యలను గుర్తించినా పరిష్కరించలేదు.

* ధరణి సమస్యలపై 2021 డిసెంబరులో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయగా దాదాపు 40 సమస్యలు గుర్తించారు. కొన్నిటిపై ఉపసంఘం చేసిన సిఫార్సులు అమలు కాలేదు.

* వీఆర్వో వ్యవస్థను 2020లో రద్దు చేయడంతో ప్రతి తహసీల్దారు కార్యాలయంలో సగటున పదిమంది సిబ్బంది కొరత ఏర్పడింది. వారి స్థానంలో జూనియర్‌ ఆర్‌ఐలు లేదా జూనియర్‌ అసిస్టెంట్లను నియమిస్తామని చెప్పినా ఇప్పటికీ సాకారం కాలేదు. వీఆర్వోల కారుణ్య నియామకాలూ చేపట్టాల్సి ఉంది.

* వీఆర్‌ఏలకు పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణకు చర్చలు నిర్వహించినా.. అమలు దస్త్రం పెండింగ్‌లో ఉంది.

* సిబ్బందికి స్పౌజ్‌, పరస్పర అవగాహన బదిలీలు, అనారోగ్య సంబంధిత విన్నపాలు, ఏసీబీ కేసుల పరిష్కారం అనంతరం ఇవ్వాల్సిన పోస్టింగ్‌లు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. శాఖ పరిధిలో 300కి పైగా కారుణ్య నియామకాలు, 2016 నుంచి పదోన్నతులూ పెండింగ్‌లో ఉన్నాయి.

* ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమీక్షలు లేవు. ఏడేళ్ల క్రితం సిన్హా కమిటీ నివేదికలో పేర్కొన్న ఆక్రమణలను ఇప్పటికీ తొలగించలేదు.

* సమగ్ర భూ సర్వే టెండర్ల దశవరకు వచ్చి నిలిచిపోయింది. అటవీ-రెవెన్యూ భూముల సరిహద్దుల్లో స్పష్టత లేక 2.40 లక్షల ఎకరాలు వివాదాల్లో ఉండిపోయాయి.  

* భూ సమస్యలపై కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ముఖ్యమైన సలహాలు పొందేందుకు సీసీఎల్‌ఏ మార్గదర్శకత్వం వహించాల్సి ఉండగా నోటిమాట ఆదేశాలతో శాఖ నడుస్తోందని రెవెన్యూవర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తిస్థాయి శాఖాధిపతిని నియమిస్తే.. సరైన సూచనలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని