సర్కారు వైద్యంపై పేదలకు పెరిగిన నమ్మకం
‘అన్ని వయసుల వారికి ఆరోగ్యం.. అన్ని దశల్లో ఆరోగ్యం’ నినాదంతో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు.
రాష్ట్రంలో అయిదంచెల వైద్య వ్యవస్థ
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక-2022 విడుదల
ఈనాడు, హైదరాబాద్: ‘అన్ని వయసుల వారికి ఆరోగ్యం.. అన్ని దశల్లో ఆరోగ్యం’ నినాదంతో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంపై పేదలకు నమ్మకం పెరిగిందని తెలిపారు. అత్యుత్తమ వైద్య సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ 2022 వార్షిక నివేదికను ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో హరీశ్‌రావు విడుదల చేసి మాట్లాడారు. ‘‘వైద్యఆరోగ్య శాఖ తలసరి బడ్జెట్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ శాఖకు రూ.11,440 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో గతంలో మూడంచెల వైద్య వ్యవస్థ ఉండగా.. ప్రస్తుతం పల్లె/బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీల రూపంలో అయిదంచెల్లో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాం. 2022లో ఒకేసారి 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం దేశ చరిత్రలోనే రికార్డు. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభిస్తున్నాం. గత ఏడాది అదనంగా 200 పీజీ సీట్లు తెచ్చాం. కాన్పు సమయంలో తల్లుల మరణాల (ఎంఎంఆర్) జాతీయ సగటు 97 కాగా.. రాష్ట్రంలో 56 నుంచి 43కు తగ్గించాం. శిశు మరణాల (ఐఎంఆర్) జాతీయ సగటు 28 కాగా.. తెలంగాణలో 23 నుంచి 21కి తగ్గించాం.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్తగా 8,200 పడకల ఏర్పాటు పనులు ప్రారంభించాం. టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణాలకు బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోనున్నాం. వైద్య ఆరోగ్యశాఖలో గతేడాది 12,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 969 సివిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ 5 నెలల్లోనే పూర్తయింది. 5,204 స్టాఫ్ నర్సుల నియామకం సహా ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో ప్రొఫెసర్‌లుగా త్వరలో పదోన్నతులు కల్పిస్తాం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఎలా ఉందో.. తెరాస ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి. ప్రభుత్వ వైద్యంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా ఛత్తీస్‌గఢ్ 10వ స్థానంలో, రాజస్థాన్ 16వ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యం కోసం వచ్చేవారు 31 శాతం మంది ఉండగా నేడు 62 శాతానికి పెరిగారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వమైన ఉత్తర్ ప్రదేశ్.. ప్రభుత్వ వైద్యంలో చిట్టచివరి స్థానంలో ఉందని కేంద్రమే చెప్పింది’’ అని మంత్రి వివరించారు.
2022లో వైద్య ఆరోగ్యశాఖలో పురోగతి ఇలా..
* గతంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 101కి పెరిగింది.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల సంఖ్య 4.23 కోట్ల నుంచి 4.83 కోట్లకు, ఇన్‌పేషెంట్ సేవలు 14.16 లక్షల నుంచి 16.97 లక్షలకు పెరిగాయి. మేజర్, మైనర్ శస్త్రచికిత్సలు 2.57 లక్షల నుంచి 3.04 లక్షలకు పెరిగాయి.
* 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ విజయవంతమైంది.
* గతేడాది మొత్తం 5.40 లక్షల కాన్పులు జరగగా 3.27 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయి. ఆసుపత్రి ప్రసవాలు 97 శాతం నుంచి 99.99 శాతానికి పెరిగాయి.
* గర్భిణులకు 44 ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
* బస్తీ దవాఖానాల సంఖ్య 334కు పెరగ్గా.. వీటిలో ఓపీ 34 లక్షల నుంచి 47 లక్షలకు పెరిగింది. 2,500 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశాం.
* నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్‌సీడీ) స్క్రీనింగ్ కార్యక్రమంలో 1.48 కోట్ల మందికి పరీక్షలు చేసి బీపీ, షుగర్ బాధితులకు కిట్‌లు ఇస్తున్నాం.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతేడాది 700 మందికి పైగా అవయవ మార్పిడి జరిగింది.
* ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు.
అవార్డులు.. గుర్తింపులు
ప్రభుత్వ వైద్యంలో నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మనం చేపడుతున్న అనేక వినూత్న విధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని కేంద్రమే తెలిపింది. సహజ ప్రసవానికి రూ.3,000 ప్రోత్సాహకం ఇస్తున్నాం. అన్ని రాష్ట్రాలు దీన్ని అనుసరించాలని కేంద్రం సూచించింది. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో మొదటి స్థానంలో, ఏడు పీజీ సీట్లతో దేశంలో రెండో స్థానంలో నిలిచాం. మిడ్ వైఫరీ వ్యవస్థకు ‘టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్’ అవార్డు వచ్చింది. యూనిసెఫ్ సైతం ప్రశంసించింది. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, సంరక్షించడంలో రెండో స్థానంలో నిలిచి పురస్కారం అందుకున్నాం. తెలంగాణ డయాగ్నోస్టిక్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు, నేషనల్ హెల్త్ మిషన్ ప్రశంసలు, పల్లె దవాఖానాల ఏర్పాటుకు కేంద్రం నుంచి అవార్డు అందాయి.
హరీశ్‌రావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?