పోలీసు ఉద్యోగార్థులకు అదనంగా 7 మార్కులు

పోలీసు రాత పరీక్షల్లో.. హైకోర్టు ఆదేశాల మేరకు ఏడు మార్కులు కలపడంతో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి ఫిబ్రవరిలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి నిర్ణయించింది.

Published : 30 Jan 2023 04:56 IST

నూతన ఉత్తీర్ణుల వివరాలు నేడు వెబ్‌సైట్‌లో
ఆయా అభ్యర్థులకు 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
నియామక మండలి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు రాత పరీక్షల్లో.. హైకోర్టు ఆదేశాల మేరకు ఏడు మార్కులు కలపడంతో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి ఫిబ్రవరిలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి నిర్ణయించింది. ఈ మేరకు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాస్‌రావు ఆదివారం కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇటీవల ముగిసిన ప్రాథమిక రాత పరీక్షల్లో ఏడు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఆ ఏడు ప్రశ్నలకు.. ఏడు మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 24, 25 తేదీల్లో నియామక మండలికి అందాయి. ఈ మార్కులు కలపడంతో కొత్తగా ఉత్తీర్ణులైన వారి వివరాలను జనవరి 30న నియామక మండలి వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నారు. వీరు తదుపరి దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యేందుకు నియామక మండలి వెబ్‌సైట్లోకి వెళ్లి పార్ట్‌-2 దరఖాస్తు చేయాలి. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8 నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల మధ్య ఈ దరఖాస్తులు సమర్పించాలి. ఈ గడువు పెంపు ఉండదని మండలి ఛైర్మన్‌ స్పష్టం చేశారు. వీరికి ఫిబ్రవరి 15 నుంచి హైదరాబాద్‌, సైబరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఆదిలాబాద్‌ కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 12 గంటల మధ్య డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇబ్బందులు ఎదురైతే  support@tslprb.inకు ఈమెయిల్‌ చేయాలని, లేదంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని శ్రీనివాస్‌రావు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు