కేటాయింపులు ఘనం.. విడుదల స్వల్పం

మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నా.. ప్రభుత్వం నిధులు విదల్చని పరిస్థితి రహదారులు-భవనాల శాఖది కాగా.. రవాణాశాఖ మాత్రం వసూళ్లలో దూసుకుపోతోంది.

Published : 30 Jan 2023 04:55 IST

రహదారులు-భవనాలశాఖ నిధుల పరిస్థితి
బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ముందుకురాని గుత్తేదారులు

ఈనాడు, హైదరాబాద్‌: మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నా.. ప్రభుత్వం నిధులు విదల్చని పరిస్థితి రహదారులు-భవనాల శాఖది కాగా.. రవాణాశాఖ మాత్రం వసూళ్లలో దూసుకుపోతోంది. రహదారులను చక్కగా తీర్చిదిద్దుతామన్న ప్రకటనలు వెలువడుతున్నా ఆ స్థాయిలో నిధులు మంజూరు కాకపోవడం శాఖలో చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా ఉన్నప్పటికీ.. నిధులు అంతంతమాత్రంగానే విడుదల కావడంతో పనులు ప్రతిపాదనల స్థాయిలో మగ్గిపోతున్నాయి. నిధుల లేమి కారణంగా కొన్ని పనులు చేసేందుకు గుత్తేదారులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రహదారులు-భవనాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.8,327 కోట్లు కేటాయించింది. కానీ, డిసెంబరు నాటికి రూ.3,200 కోట్ల వరకే విడుదల చేసినట్లు సమాచారం. ఇంకా చేయాల్సిన పనులు రూ.10 వేల కోట్లకుపైగా ఉండటం విశేషం. విడుదల చేసిన నిధుల్లో అధిక శాతం గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలకే సరిపోయినట్లు సమాచారం. ఇంకా పెద్దమొత్తంలో బిల్లులు చెల్లించాల్సి ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ ఈ శాఖకు ప్రభుత్వం రూ.8 వేల కోట్లకుపైగా కేటాయించినా.. అంతంతమాత్రంగానే విడుదల చేసింది.

గుత్తేదారుల వెనుకంజ

రాష్ట్రంలో చేయాల్సిన రహదారుల పనులు చాలా ఉన్నాయి. చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తుండటంతో గుత్తేదారులు వెనుకంజ వేస్తున్నారు. ఇటీవల కాలంలో పంచాయతీరాజ్‌ శాఖ నుంచి పెద్దమొత్తంలో రహదారులు చేరటంతో.. వాటి విస్తరణ పనులు చేయాల్సి ఉంది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అధికారులు టెండర్లు ఆహ్వానించగా.. కొన్ని పనులకు తొలుత టెండర్లు వేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపలేదు. చెల్లింపుల్లో జాప్యమే దీని వెనుక ఆంతర్యం. గతంలో పనులు చేసిన గుత్తేదారులతో క్షేత్రస్థాయి అధికారులు మంతనాలు నిర్వహించటంతో రెండోసారి టెండర్లు వేసేందుకు పలువురు ముందుకొచ్చినట్లు సమాచారం. రాష్ట్రం ఏర్పడినప్పుడు రహదారులకు ఇచ్చిన ప్రాధాన్యం ఇటీవలి కాలంలో తగ్గిందన్న అభిప్రాయం అధికారుల్లో సైతం వ్యక్తమవుతోంది.


దూసుకుపోతున్న రవాణాశాఖ ఆదాయం

రవాణాశాఖ ఆదాయం అంచనాలను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,953 కోట్లు ఆర్జించాలన్నది లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే దాన్ని చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న బీఎస్‌-6 స్థానంలో ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6.2 ఇంజిన్‌తో కూడిన వాహనాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు మరింత పెరుగుతాయని డీలర్లు భావిస్తున్నారు. దాంతో ఆదాయం సుమారు రూ.5,400 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు