సంక్షిప్త వార్తలు(12)

జేఎన్‌టీయూహెచ్‌లో 12 మంది ఆచార్యులకు సీనియర్‌ ఆచార్యులుగా సోమవారం పదోన్నతి ఉత్తర్వులిచ్చారు.

Updated : 31 Jan 2023 05:38 IST

సీనియర్‌ ఆచార్యులుగా పదోన్నతులు
‘ఈనాడు’ వార్తకు స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌లో 12 మంది ఆచార్యులకు సీనియర్‌ ఆచార్యులుగా సోమవారం పదోన్నతి ఉత్తర్వులిచ్చారు. ఈనెల 29న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘సీనియర్‌’ పదోన్నతుల్లో ఎందుకంత జాప్యం’? అనే శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గత 3 నెలలుగా పెండింగ్‌లో ఉన్న 12 మందికి పదోన్నతి ఇస్తూ రిజిస్ట్రార్‌ సోమవారం ఆర్డర్లు అందజేశారు.


ఉపాధ్యాయ బదిలీ దరఖాస్తు గడువు 1 వరకు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 1 వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన గడువు సోమవారంతో ముగియగా.. గడువును పొడిగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ తదితర సంఘాలు ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రెండు రోజులపాటు పొడిగిస్తూ విద్యాశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.


రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి అద్భుత అవకాశాలు: విజయ్‌గుప్తా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మత్స్యరంగానికి అద్భుత భవిష్యత్తు ఉందని అంతర్జాతీయ మత్స్యరంగ నిపుణుడు మోదుగు విజయ్‌ గుప్తా తెలిపారు. ఈ రంగం ద్వారా ఆదాయ వనరులు, ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలలో భాగంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ఫలితంగా రాష్ట్రంలో నీటి వనరుల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, దీంతో చేపల ఉత్పత్తిని, ఉత్పాదకతలను పెంచుకునేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన విజయ్‌ గుప్తాను సోమవారం ఆయన నివాసంలో భారాస ఎమ్మెల్సీ, ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌, ఇతర ప్రతినిధులు కలిసి సత్కరించారు.


అగ్నిపథ్‌కు ఎంపికైన గురుకుల విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: సైన్యంలో ప్రవేశానికి నిర్వహించిన అగ్నిపథ్‌ ఎంపికల్లో గిరిజన గురుకులాలకు చెందిన నలుగురు విద్యార్థులు చోటుదక్కించుకున్నారు. గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న మాలోత్‌ జావేందర్‌, భానోత్‌ రావు, వేల్పుల అజయ్‌, అశోక్‌ నగర్‌ గిరిజన సైనిక స్కూల్‌కు చెందిన ఇస్లావత్‌ నరేశ్‌లు ఇటీవల నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ చూపించి ఉద్యోగాలు పొందారు.


రికార్డ ధర పలికిన కొత్త దేశీ రకం మిర్చి

ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో కొత్త దేశీ రకం మిర్చి సోమవారం రికార్డు ధర పలికింది. క్వింటాకు ఏకంగా రూ.81 వేలు లభించింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌ మండలం దుబ్బపల్లె గ్రామానికి చెందిన పల్లెపాటి విద్యాసాగర్‌ మార్కెట్‌కు తీసుకొచ్చిన మూడు బస్తాల దేశీరకం మిర్చిని సాగర్‌ ట్రేడర్స్‌ అడ్తీ ద్వారా భాగ్యలక్ష్మి ట్రేడర్స్‌ అనే వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ నెల 6న కొత్త దేశీ రకానికి క్వింటా రూ.80,100 లభించగా గతేడాది సెప్టెంబరు 29న శీతల గిడ్డంగుల్లోని దేశీ మిర్చి క్వింటాకు రూ.90 వేలు ధర పలికింది.


క్రికెట్‌ క్రీడాకారిణి త్రిషకు రేవంత్‌రెడ్డి అభినందనలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మహిళల అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత జట్టును విశ్వ విజేతగా నిలపడంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ క్రీడాకారిణి గొంగడి త్రిషను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ విషయమై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘మన మట్టిలో పుట్టిన మరో ఆణిముత్యం. విశ్వ క్రీడా వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భద్రాద్రి ‘రామ బాణం’. లక్షలాది యువ తరంగాలకు మరో స్పూర్తి గీతం. మహిళల అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత జట్టును విశ్వవిజేతగా నిలిపిన తెలంగాణ బిడ్డ త్రిషకు శుభాభినందనలు’ అని పేర్కొన్నారు.


ఈఎన్‌టీలో ఆరు పోస్టుల భర్తీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్యవిద్య డైరెక్టర్‌ పరిధిలోని ఈఎన్టీ విభాగాల మూడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు (ఈఎన్‌టీ), మరో మూడు స్పీచ్‌ పాథాలజిస్టుల భర్తీకి ఆర్థికశాఖ సోమవారం అనుమతించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈ రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని, మెడికల్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఇతర వివరాలు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.


317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలి
మంత్రి సబితారెడ్డికి హర్షవర్దన్‌రెడ్డి వినతి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: జీవో 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు స్థానికతను కల్పిస్తూ ఈ బదిలీల్లోనే వారికి అవకాశం కల్పించాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత జి.హర్షవర్దన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు కూడా ప్రస్తుత బదిలీల్లోనే అవకాశం కల్పించాలన్నారు.


నేడు కృష్ణా బోర్డు ఛైర్మన్‌ పదవీ విరమణ  
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు అదనపు బాధ్యతలు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య సంఘం (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. 2021 సంవత్సరం మే నెలలో ఆయన బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి శివ్‌ నందన్‌కుమార్‌ను అదనపు బాధ్యతలతో నియమించినట్లు తెలిసింది.


వరదల సమయంలో సేవలందించిన 17 మందికి గుర్తింపు
ప్రశంసాపత్రాలు అందించనున్న నీటిపారుదల శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గతేడాది జులై నెలలో వచ్చిన వరదల సమయంలో విశిష్ట సేవలు అందించిన 17 మంది ఇంజినీర్లు, అధికారులు, సిబ్బందికి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వారికి మంగళవారం జలసౌధలో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించనున్నారు. ప్రధానంగా కడెం జలాశయం, గోదావరి తీరంలోని భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్‌ ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు వరదల నియంత్రణకు, ప్రాణనష్టం నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. వారి సేవలు గుర్తించిన అధికారులు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు. వీటికి ఎంపికైన వారిలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్‌.శంకర్‌, సంయుక్త కార్యదర్శి ఎస్‌.భీం ప్రసాద్‌, ఎస్‌ఈ సాజిద్‌, జలసౌధ నుంచి ప్లానింగ్‌-మేనేజ్‌మెంట్‌ ఎస్‌ఈ కె.శ్రీనివాస్‌, భద్రాద్రి సీఈ ఎ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ కె.వెంకటేశ్వరరెడ్డి, డీఈఈ ఎస్‌.రామకిశోర్‌, నిర్మల్‌ ఎస్‌ఈ డి.సుశీల్‌కుమార్‌, కడెం ఈఈ సీహెచ్‌.రాజశేఖర్‌, డీఈఈ బి.రవికుమార్‌తోపాటు ఇతర సర్కిళ్ల ఏఈఈలు ఉన్నారు.


ఉత్తర తెలంగాణలో మరికొన్ని రోజులు చలి

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని రోజులపాటు చలితీవ్రత ఉండే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే గురువారం నుంచి శనివారం మధ్య 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా దత్తప్పగూడలో రాష్ట్రంలోనే కనిష్ఠంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


అసెంబ్లీ ముగిసేలోపు ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌: శ్రీనివాస్‌గౌడ్‌

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ను ప్రకటిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్‌ ఈహెచ్‌ఎస్‌ను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ విశ్రాంత గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నూతన సంవత్సర కాలమానిని, దైనందిని ఆవిష్కరణ సభలో మంత్రి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని