6న రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం వచ్చే నెల ఆరో తేదీన ప్రవేశపెట్టనుంది. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో మంత్రి హరీశ్‌రావు, మండలిలో వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

Published : 31 Jan 2023 04:57 IST

ఉదయం 10.30 గంటలకు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
3న గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాల ప్రారంభం
అనూహ్య పరిణామాల మధ్య గవర్నర్‌తో చర్చించి ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం వచ్చే నెల ఆరో తేదీన ప్రవేశపెట్టనుంది. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో మంత్రి హరీశ్‌రావు, మండలిలో వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి మూడో తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమయ్యే ఉభయసభల సమావేశంలో గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. సోమవారం జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. గవర్నర్‌ తమిళిసై అభిప్రాయాల మేరకు శాసనసభ సమావేశాలు, బడ్జెట్‌, గవర్నర్‌ ప్రసంగాల విషయంలో ఈ మేరకు మార్పులు జరిగాయి.

ఉదయం నుంచీ ఉత్కంఠ...

ముందుగా ఈ నెల మూడో తేదీన శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభించాలని.. అదే రోజు బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ ప్రొరోగ్‌(సమావేశాల ముగింపు ప్రకటన) కాలేదన్న కారణంతో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరపాలని భావించింది. అనంతరం నిబంధనల మేరకు బడ్జెట్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. దీనిపై ప్రభుత్వం సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. హైకోర్టు జోక్యంతో రాజ్‌భవన్‌ న్యాయవాది, రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ల మధ్య కుదిరిన అవగాహన మేరకు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ నిర్వహణపై సమావేశం జరిపారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల్లో ప్రసంగానికి గవర్నర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు రామకృష్ణారావు, నరసింహాచార్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉభయసభల్లో ప్రసంగానికి ఆమెను ఆహ్వానించారు. బడ్జెట్‌ సమావేశాల గురించి వివరించి, ఆమెకు అనుకూలమైన తేదీ గురించి అడిగారు. బడ్జెట్‌ ప్రసంగపాఠం ఎప్పుడు పంపించాలనే దానిపైనా అభిప్రాయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పెండింగు బిల్లుల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ప్రశాంత్‌రెడ్డి, ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌ నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంను కలిశారు. గవర్నర్‌ అభిప్రాయాలను ఆయనకు తెలియజేశారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ తేదీలు ఖరారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని