అసాధ్యమనేదే లేదు.. నా జీవితమే ఉదాహరణ

ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని వీడొద్దని అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రేరణ వక్త, రచయిత నిక్‌ వుజిసిక్‌ విద్యార్థులకు సూచించారు.

Updated : 31 Jan 2023 08:15 IST

జీవితాన్ని నిర్ణయించేది వ్యక్తి వైఖరే
ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణ వక్త నిక్‌ వుజిసిక్‌ ఉద్భోద
మల్లారెడ్డి వర్సిటీలో ప్రసంగం 

మేడ్చల్‌, న్యూస్‌టుడే: ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని వీడొద్దని అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రేరణ వక్త, రచయిత నిక్‌ వుజిసిక్‌ విద్యార్థులకు సూచించారు. ఎదుగుదల కోసం ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి వర్సిటీలో ‘ఆటిట్యూడ్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌’ పేరుతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంట పాటు నిర్విరామంగా ప్రసంగించారు. చేతులు, కాళ్లు పూర్తిగా లేకుండా జన్మించిన వుజిసిక్‌.. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమించడానికి తన వ్యక్తిగత కథ, జీవన పయనంలో సాధించిన సానుకూల దృక్పథం, పోషించిన పాత్రను విద్యార్థులతో పంచుకున్నారు.

పెళ్లవుతుందని, పిల్లలు ఉంటారని అనుకోలేదు..

‘‘జీవితాన్ని నిర్ణయించేది వ్యక్తి వైఖరే. గమ్యాన్ని నిర్దేశించుకొని.. ఆ దిశగా పయనించే వారు తప్పకుండా విజయం సాధిస్తారు. మనకెదురయ్యే పరిస్థితులను మార్చడం సాధ్యం కాదు. వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. ఆ దిశగా ఉత్తమ ప్రయత్నాలు చేయాలి. అసాధ్యమనే దానికి తావు లేదు. అందుకు నా జీవితమే ఉదాహరణ. కాళ్లు, చేతులు లేకుండా పుట్టిన నాకు వివాహం అవుతుందని, పిల్లలు ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, నలుగురు పిల్లలకు తండ్రినయ్యా. ఏది కావాలన్నా సొంతంగా సాధించుకోవాలనే దృక్పథాన్ని నా తల్లిదండ్రులు అలవాటు చేశారు. ఎవరూ ఎవరి కన్నా తక్కువ కాదు. అలా అని ఎక్కువా కాదు. ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. గౌరవించాలి. విద్యార్థులు సమాజానికి తమవంతుగా తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి’’ అని సూచించారు.

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. నిక్‌ వుజిసిక్‌ తన జీవిత కథను పంచుకోవడం విద్యార్థుల అదృష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ వీఎస్‌కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు