పురాల్లో అసమ్మతి స్వరాలు

హైదరాబాద్‌ శివారులోని 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్‌పర్సన్లు, మేయర్లపై అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి.

Published : 31 Jan 2023 03:57 IST

ఆదిభట్ల ఛైర్‌పర్సన్‌పై కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం
పలుచోట్ల ప్రత్యేక భేటీలు

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-ఆదిభట్ల, తుర్కయాంజాల్‌ పురపాలిక: హైదరాబాద్‌ శివారులోని 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్‌పర్సన్లు, మేయర్లపై అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. జవహర్‌నగర్‌ మేయర్‌ మేకల కావ్యకు వ్యతిరేకంగా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడంతో మరికొన్నింటిలోనూ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లకు వ్యతిరేకంగా తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా సోమవారం ఆదిభట్లలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కొత్త ఆర్తికపై 13 మంది కౌన్సిలర్ల సంతకాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన ప్రతిని అందజేశారు. మున్సిపల్‌ కమిషనర్‌కు మంగళవారం ఇవ్వనున్నారు. ఇక్కడ మొత్తం 15 కౌన్సిలర్లున్నారు. 8 మంది భారాస, ఆరుగురు కాంగ్రెస్‌, ఒక భాజపా సభ్యుడున్నారు. ఛైర్‌పర్సన్‌పై భాజపా కౌన్సిలర్‌ తప్ప మిగిలిన 13 మందీ అవిశ్వాసానికి ప్రతిపాదించారు. ఛైర్‌పర్సన్‌ మూడేళ్లుగా అభివృద్ధి పనులు చేపట్టలేదని.. కౌన్సిలర్లకు కనీస గౌరవం దక్కడం లేదని వారు విమర్శించారు.

రహస్య సమావేశాలు

మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పదవులను ఆశిస్తున్నవారు తమకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి రహస్యంగా సమావేశాలు, శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దమ్మాయిగూడ, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీల్లో కొందరు కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ, కొంపల్లి, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్‌, తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవసరమైన మూడొంతుల మంది సభ్యుల మద్దతు కూడగట్టే యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పీర్జాదిగూడలో ఓ కార్పొరేటర్‌, తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలో ఒక మహిళా కౌన్సిలర్‌ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పారిజాత ఇతరకార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని 10 మంది భాజపా కార్పొరేటర్లు ప్రకటించారు. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 32 స్థానాలుండగా.. భారాసకు 13, భాజపాకు 10, కాంగ్రెస్‌కు ఏడుగురు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉన్నారు.


జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రాజీనామా ఆమోదం

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆమోదించారు. ఛైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేసినట్లు ఈ నెల 25న కలెక్టర్‌కు లేఖ పంపించారు. ఆమెను కలెక్టర్‌ సోమవారం పిలిపించి మాట్లాడగా.. ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నానని, తనపై ఎవరి ఒత్తిడి లేదని చెప్పారు. మరోసారి రాజీనామా లేఖ ఇవ్వడంతో ఆమోదించారు. వైస్‌ఛైర్మన్‌ గోలి శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని