అంచనాలు తలకిందులు

2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి భారీ ఆర్థిక తోడ్పాటును ఆశించిన రాష్ట్రానికి తీవ్ర నిరాశే ఎదురైంది.

Updated : 31 Jan 2023 08:22 IST

కేంద్రం ఆర్థిక తోడ్పాటుపై తప్పిన అంచనాలు
పథకాలకు మినహా అదనపు నిధులపై మొండిచేయి
రుణ పరిమితిలో మార్పులతో రూ.19 వేల కోట్ల కోత
2022-23 బడ్జెట్‌ అంచనాలపై తీవ్ర ప్రభావం

ఈనాడు, హైదరాబాద్‌: 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి భారీ ఆర్థిక తోడ్పాటును ఆశించిన రాష్ట్రానికి తీవ్ర నిరాశే ఎదురైంది. గ్రాంట్ల రూపంలో భారీ మొత్తాన్ని ఆశించగా.. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతోనే సర్దుకోవాల్సి వచ్చింది. కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు, రుణాల అంశంలో రూ.1,05,575 కోట్ల అంచనాలకుగాను డిసెంబరు ఆఖరు నాటికి కేవలం రూ.45,159 కోట్లు మాత్రం రాష్ట్రానికి వచ్చింది. చివరి త్రైమాసికంలో గరిష్ఠంగా మరో రూ.15వేల కోట్లు మాత్రమే వచ్చే అవకాశముందని ఆర్థికశాఖ అంచనా. కేంద్రంనుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల వాటాతో పాటు ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి మార్పుల నేపథ్యంలో 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

రుణాలపై ఆంక్షలతో..

రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చేర్చేవారు కాదు. గత ఆర్థిక సంవత్సరం మార్చి 31న అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకునే రుణాలన్నీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేయడంతో రుణ పరిమితిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో పాటు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న రుణాలనూ పరిగణనలోకి తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిలో కోత పడింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.52,167 కోట్ల రుణాలను బాండ్ల విక్రయం ద్వారా సమకూర్చుకోనున్నట్లు బడ్జెట్‌లో రాష్ట్రం ప్రతిపాదించగా.. కేంద్రం నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. డిసెంబరు ఆఖరు నాటికి బాండ్ల విక్రయంతో రూ.29,008 కోట్లను సమకూర్చుకుంది. ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రుణ అంచనాల్లో సుమారు రూ.19 వేల కోట్ల మేర తగ్గనుండటం రాష్ట్ర బడ్జెట్‌ పరిమాణాన్ని ప్రభావితం చేస్తోంది.

ఒక్క పైసా రాని ప్రత్యేక గ్రాంట్లు

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతో పాటు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక నిధులు, నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకు భారీ మొత్తంలో కేంద్ర గ్రాంట్లను రాష్ట్రం ఆశించింది. ఈ మూడు అంశాల రూపంలో రూ.41,001 కోట్లు వస్తాయని భావించగా.. ప్రత్యేక గ్రాంట్లలో ఒక పైసా రాలేదు. 

కేంద్ర ప్రాయోజిత పథకాలకే నిధులు

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.500 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1,837 కోట్లు, సాగునీటి రంగానికి రూ.115కోట్లు, రహదారులు-భవనాల శాఖకు రూ.1,387 కోట్లు, సమగ్ర శిక్ష సహా విద్యారంగానికి రూ.636 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.428 కోట్లు, గృహనిర్మాణ శాఖకు రూ.1,000 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.708 కోట్లు, సంక్షేమ రంగానికి రూ.198 కోట్లు, సామాజిక భద్రత, మహిళా శిశుసంక్షేమానికి రూ.373 కోట్లతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సుమారు రూ.12 వేల కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా మూడో త్రైమాసికం చివరి నాటికి విడుదలైన నిధులు రూ.7,770 కోట్లే. చివరి త్రైమాసికంలో ఏమేరకు వస్తాయనేది అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

* కేంద్ర పన్నుల వాటాను బడ్జెట్‌ అంచనాల్లో రూ.12,407 కోట్లుగా అంచనా వేయగా.. డిసెంబరు ఆఖరుకు రూ.8,381 కోట్లు అందాయి. ఇది మాత్రమే అంచనాల మేరకు అందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖభావిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు