పీజీ లేకున్నా ఎంపీఈడీ అర్హత ఉన్నవారిని అనుమతించండి

జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల రాత పరీక్షలకు  పీజీతో సంబంధం లేకుండా ఎంపీఈడీ అర్హత ఉన్న పిటిషనర్లను అనుమతించాలంటూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 31 Jan 2023 04:31 IST

ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులపై టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల రాత పరీక్షలకు  పీజీతో సంబంధం లేకుండా ఎంపీఈడీ అర్హత ఉన్న పిటిషనర్లను అనుమతించాలంటూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫలితాలను మాత్రం వెల్లడించరాదని పేర్కొంది. జూనియర్‌ కాలేజీల్లో పీడీ పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరులో టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని అర్హతల నిబంధనను సవాలు చేస్తూ 192 మంది దాకా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇంటర్‌ పీడీ పోస్టుల నిమిత్తం పీజీ విద్యార్హతతోపాటు ఎంపీఈడీ ఉండాలన్న షరతు విధించిందని, ఇది రాజ్యాంగంతోపాటు ఎన్‌సీటీఈ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎంపీఈడీ పూర్తి చేయడానికి ఇంటర్‌ తరువాత ఏడేళ్ల సమయం పడుతుందన్నారు. పీజీతోపాటు ఎంపీఈడీ ఉండాలన్న నిబంధనల వల్ల అనేకమంది ఎంపిక ప్రక్రియలో పాల్గొనలేకపోతున్నారని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్లను రాత పరీక్షలకు అనుమతించాలని, అయితే ఫలితాలను మాత్రం వెల్లడించరాదని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు