బడ్జెట్‌ సమావేశాలు 14 వరకు ఉండొచ్చు

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 14 వరకూ నిర్వహించే అవకాశాలున్నాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Updated : 01 Feb 2023 06:23 IST

చిట్‌చాట్‌లో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 14 వరకూ నిర్వహించే అవకాశాలున్నాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండలిలోని తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం సర్దుకుంటుందని తాను ముందే చెప్పానన్నారు. గవర్నర్‌తో విభేదాలు వస్తాయి.. పోతాయని, గవర్నర్‌, ప్రభుత్వం, అసెంబ్లీ.. ఒకదానికొకటి సమ్మిళితమై ఉంటాయని, ఇందులో ఎవరి విజయం ఉండదని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో గవర్నర్‌ ప్రసంగం ఉండదనే తాను భావిస్తున్నానని, గవర్నర్‌ ప్రసంగం సాఫీగా జరగాలని ఆశిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో సంపూర్ణ రుణమాఫీ, సొంతస్థలం ఉన్నవారికి ఇళ్లనిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వడం.., ఈ రెండు హామీలు నెరవేరాల్సి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, చేయాలా? వద్దా? అనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత ఉందనీ, అయితే భారాసకు జాతీయ స్థాయిలో ఆదరణ ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నల్గొండలో ఈసారి భారాసకు అధిక స్థానాలు దక్కుతాయని, వామపక్షాల పొత్తు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిధర్‌ గమాంగ్‌ సీనియర్‌ నాయకుడని, ఆయన చేరికతో భారాసకు అదనపు బలం చేకూరిందని తెలిపారు. రాజకీయ నాయకుల పని అయిపోయిందని భావించవద్దని, నీలం సంజీవరెడ్డి ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండి ఎంపీ, లోక్‌సభ స్పీకర్‌, రాష్ట్రపతి కూడా అయ్యారని గుర్తు చేశారు. తెరాస.. భారాసగా మారినా.. పార్టీ గుర్తు, అధినేత మారలేదని, దీనివల్ల ఇబ్బంది ఉండదన్నారు. తనకూ మంత్రి జగదీశ్‌రెడ్డికి మధ్య విభేదాలు లేవని, తాను ఎవరితోనూ పంచాయితీ పెట్టుకోనని, ఏ వ్యవహారాల్లో తలదూర్చనని పేర్కొన్నారు. తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర ప్రభావం ఉండదని, కర్ణాటకలో ఉండొచ్చని అన్నారు. తెదేపా జవజీవాలు కోల్పోయిన పార్టీ అని, ఇప్పుడు దానికి జీవంపోసే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినా ఫలితం శూన్యమని గుత్తా చెప్పారు. విపక్ష సభ్యులకు సభలో మాట్లాడటానికి తగిన సమయం ఇస్తామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు