ఎస్పీడీసీఎల్‌లో 1601 పోస్టుల భర్తీకి సన్నాహాలు

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో 1601 ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు.

Published : 01 Feb 2023 03:58 IST

మంత్రి జగదీశ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో 1601 ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. 1553 జూనియర్‌ లైన్‌మెన్‌, 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుత రబీ సీజన్‌, రాబోయే ఎండాకాలంలో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్తు సంస్థలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి మంగళవారం మింట్‌ కాంపౌండ్‌లో సమీక్ష నిర్వహించారు. ఏటా రికార్డుస్థాయిలో విద్యుత్తు డిమాండ్‌ నమోదవుతోందన్నారు. గతేడాది రబీ సీజన్‌లో 14160 మెగావాట్లకు చేరిందన్నారు. ఎన్నడూ లేనిరీతిలో గత డిసెంబరు 30న సైతం 14017 మెగావాట్లు నమోదవ్వడం గుర్తించాలన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాబోయే వేసవిలో 15,500 మెగావాట్ల డిమాండ్‌కు అవకాశముందన్నారు.  

త్వరలో విద్యుత్తు ఉద్యోగులకు పీఆర్‌సీ

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస(టీఈఈజాక్‌) కన్వీనర్‌ ఎన్‌.శివాజీ నేతృత్వంలో పలువురు మంగళవారం మంత్రిని కలిసి పీఆర్సీపై విన్నవించారు. ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పు, ట్రాన్స్‌కో, జెన్‌కోలలో 166 మంది ఇంజినీర్ల రివర్షన్‌ అంశాలనూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రివర్షన్‌ అయిన వారిని సర్దుబాటు చేయడానికి ఉన్న అవకాశాలను వివరించారు. మంత్రి మాట్లాడుతూ విద్యుత్తు ఇంజినీర్లలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వబోమని తెలిపారు. సీఎండీ ప్రభాకర్‌రావుతో చర్చించి అన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు