ధర లేక పసుపు పంటకు పాతర

పసుపు రైతంటే గ్రామాల్లో ఒక హోదా.. పసుపు సాగంటే ఒక ఉత్సాహం.. ఇవన్నీ ఆయా రైతుల కుటుంబాల్లో గత వైభవాలుగా మిగిలిపోయాయి.

Published : 01 Feb 2023 04:54 IST

రాష్ట్రంలో 30 వేల ఎకరాలు తగ్గిన సాగు
తగ్గనున్న 90 వేల టన్నుల ఉత్పత్తి

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: పసుపు రైతంటే గ్రామాల్లో ఒక హోదా.. పసుపు సాగంటే ఒక ఉత్సాహం.. ఇవన్నీ ఆయా రైతుల కుటుంబాల్లో గత వైభవాలుగా మిగిలిపోయాయి. ప్రతికూల పరిస్థితులు పసుపు సాగును పాతరేస్తున్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో రాష్ట్రంలో ఈ పంట సాగు, ఉత్పత్తి తగ్గుతోందని మార్కెటింగ్‌ శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏటా ధరల పతనం, పెట్టుబడి ఖర్చులు పెరగడం, చీడపీడల ప్రభావం.. తదితర కారణాలతో ఈ పంట వేసేందుకు రైతులు సాహసించడం లేదు. రాష్ట్రంలో 2021-22 సీజన్‌లో 85,916 ఎకరాల్లో పసుపు పంట సాగు చేయగా.. 2,56,029 టన్నుల దిగుబడి వచ్చింది. 2022-23 సీజన్‌లో సాగు విస్తీర్ణం 56,073 ఎకరాలకు పరిమితం కాగా.. 1,67,092 టన్నుల ఉత్పత్తి రావచ్చని మార్కెటింగ్‌ శాఖ అంచనా వేస్తోంది. అంటే గత సాగు సంవత్సరంతో పోలిస్తే 30 వేల ఎకరాల సాగు తగ్గింది. ఉత్పత్తి 90 వేల టన్నుల వరకూ తగ్గనుంది. 

2010లో క్వింటా పసుపు రూ.16 వేల పైచిలుకు పలికింది. ఆ తర్వాత ఏడాది నుంచి క్వింటాకు సగటు ధర అటు ఇటుగా రూ.8,500కి పరిమితమైంది. మూడేళ్లుగా పరిస్థితి దయనీయంగా ఉంది. గతేడాది రూ.7,400తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత సీజన్‌ ప్రారంభంలో సగటు ధర రూ.5,500 మాత్రమే ఉండటంతో రైతులు సాగుపై ఆసక్తి చూపలేదు. మరోవైపు అధిక వర్షాలు, చీడపీడలతో దిగుబడులు తగ్గి రైతులు అప్పులపాలవుతున్నారు.

శాస్త్రీయ పరిశోధనల్లో వెనుకంజ

కొత్త వంగడాలు, కర్క్యూమిన్‌ శాతం పెంచే రకాలు అందుబాటులోకి రాకపోవడం, యాంత్రీకరణ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వకపోవడం, సస్యరక్షణలో నూతన విధానాలపై రైతులకు అవగాహన కల్పించకపోవడం తదితర కారణాలు ఈ పంట సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గేలా చేస్తున్నాయి. స్పైస్‌ బోర్డు సైతం సాగుదారులకు ఆశించిన స్థాయిలో సేవలందించడం లేదనే విమర్శ ఉంది. పరిశోధన స్థానాలకు సర్కారు పెద్దగా నిధులు కేటాయించకపోవడం, మద్దతు ధర ప్రకటించకపోవడం, ధర దక్కని సమయంలో కనీసం బోనస్‌లు ఇవ్వకపోవడం ప్రభావం చూపుతున్నాయి. దేశంలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లోనే అత్యధికంగా రైతులు ఈ పంట వేస్తుండగా.. వారే ప్రస్తుతం దూరమవుతున్నారు.


సగానికి తగ్గించేశా

మూడు దశాబ్దాల నుంచి.. ఏటా పదెకరాలకు తగ్గకుండా పసుపు సాగు చేస్తున్నా. ఈసారి అయిదున్నర ఎకరాలతోనే సరిపెట్టా. దీని స్థానంలో అయిల్‌పాం మొక్కలు నాటా. పసుపులో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు.  

ఎం.రమేశ్‌రెడ్డి, నూత్‌పల్లి, నందిపేట్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని