మాంసం ‘హలాల్‌’కు ధ్రువీకరణ!

మాంసం ‘హలాల్‌’ చేశారా లేదా అనేది ధ్రువీకరించే పరిజ్ఞానాన్ని జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. విదేశాలకు ఎగుమతి చేసే మాంసం నమూనాలను ఈ కేంద్రానికి పంపిస్తే అందులో ఏ జంతువు మాంసం ఉందనే వివరాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించి నాణ్యతపై ‘ధ్రువీకరణ పత్రం’ జారీ చేస్తుంది.

Published : 01 Feb 2023 04:58 IST

అభివృద్ధి చేసిన జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం
మాంసం ఎగుమతిదారులకు ప్రయోజనకరం

ఈనాడు, హైదరాబాద్‌: మాంసం ‘హలాల్‌’ చేశారా లేదా అనేది ధ్రువీకరించే పరిజ్ఞానాన్ని జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. విదేశాలకు ఎగుమతి చేసే మాంసం నమూనాలను ఈ కేంద్రానికి పంపిస్తే అందులో ఏ జంతువు మాంసం ఉందనే వివరాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించి నాణ్యతపై ‘ధ్రువీకరణ పత్రం’ జారీ చేస్తుంది. ఈ పత్రం ఆధారంగా విదేశాలకు ఎగుమతి చేయవచ్చని ఈ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బస్వారెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. మలేసియా, ఇండోనేసియా తదితర దేశాలు.. మాంసం ఎగుమతి చేయాలంటే ‘హలాల్‌’ చేశారనే ధ్రువీకరణపత్రం తప్పనిసరి చేశాయి. హలాల్‌ విషయంలో రెండు రకాల ధ్రువీకరణపత్రాలను అడుగుతున్నారు. ఒకటి మాంసం శుద్ధికి సంబంధించనది కాగా మరొకటి అది ఏ జంతువుది అనేది. ఒక మతవిశ్వాసాలకు అనుగుణంగా హలాల్‌ చేశారా? లేదా? అనేది మతపెద్దలు ఇచ్చిన ధ్రువీకరణను ‘శుద్ధి’(ప్రాసెస్‌)కి తీసుకుంటున్నారు. ఇక అది ఏ జంతువుది అనేది మాంసం పరిశోధనా కేంద్రంలో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించి ధ్రువీకరణ పత్రం ఇస్తున్నట్లు ఆయన వివరించారు. నమూనాలో పంది మాంసం ఉంటే హలాల్‌ ధ్రువీకరణ పత్రం ఇచ్చేది లేదని, ఇది ఉందా లేదా అనేది డీఎన్‌ఏ పరీక్షల్లో గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇలాగే ఆక్వాకల్చర్‌ రంగంలో చేపలకు, రొయ్యలకు వేసే దాణాను సైతం ధ్రువీకరించి ఇస్తున్నట్లు చెప్పారు. హలాల్‌కే పరిమితం కాకుండా ఇతర ఏ మాంసం నమూనాలు తెచ్చినా అది ఏ జంతువుది, ఎంతకాలం క్రితం దానిని కోసి శుద్ధి చేశారనే వివరాలను సైతం గుర్తిస్తామన్నారు. ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ జంతువులు, కుక్క వంటి పెంపుడు జంతువుల మాంసం అమ్ముతున్నారనే ప్రచారం జరగగా ఆ నమూనాలను సేకరించి ఈ కేంద్రంలో పరీక్షలు జరిపి ఫలితాలను అందజేసినట్లు బస్వారెడ్డి తెలిపారు. జంతువును కోసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, దాని విక్రయ కేంద్రంలో ఎలాంటి మౌలిక సదుపాయాలుండాలి?, ప్రజలకు విక్రయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా హైదరాబాద్‌ శివారు చెంగిచర్లలోని ఈ కేంద్రంలో వ్యాపారులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ శిక్షణ పొందుతున్నట్లు వివరించారు. నాణ్యత లేని మాంసం విక్రయాలతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, ఆరోగ్యంగా ఉన్న మేక, కోళ్లను మాత్రమే కోసి మాంసం విక్రయించాలని వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యత లేదా హలాల్‌ ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు ఎవరైనా మాంసం నమూనాలను ఈ కేంద్రానికి తీసుకురావచ్చని బస్వారెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు