35 శాతం మంది కూలీలకే ‘ఉపాధి’

గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి, సామాజిక భద్రత కోసం చేపట్టిన ఉపాధి హామీ పథకంలో పనిచేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో ముందుకొచ్చిన వారిలో 35 శాతం మందికే పనులు లభిస్తున్నాయి.

Published : 01 Feb 2023 04:58 IST

నమోదైనా పనులు కరవు
రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం తీరిది

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి, సామాజిక భద్రత కోసం చేపట్టిన ఉపాధి హామీ పథకంలో పనిచేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో ముందుకొచ్చిన వారిలో 35 శాతం మందికే పనులు లభిస్తున్నాయి. ఎక్కువ మంది కుటుంబ అవసరార్థం పనుల కోసం ప్రయత్నించినా వారికి అవకాశం దక్కడం లేదు. ఏడాదికి వంద రోజుల ఉపాధి లక్ష్యంతో 2005లో ప్రారంభమైన ఈ పథకంలో పని కోరుకునేవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గ్రామస్థాయిలో ఈ మేరకు జాబితాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. దీని ఆధారంగా పనులు చేపట్టినప్పుడు వారికి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలో 2005 నుంచి ఇప్పటివరకు 1.20 కోట్ల మందికి పైగా తమ పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్నారు. వీరిలో 60.70 లక్షల మంది పురుషులు, 59.80 లక్షల మంది మహిళలు. మొత్తం నమోదైన వారిలో 42.08 లక్షల మంది (35 శాతం)కి మాత్రమే పనులు దక్కాయి. పని పొందినవారిలో 18 లక్షల మంది మంది పురుషులు, 24 లక్షల మంది మహిళలు.

జిల్లాలవారీగా..

హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో 540 మండలాల్లోని 12769 గ్రామ పంచాయతీల్లో ఉన్న 21,491 నివాస ప్రాంతాల్లో పథకం అమలవుతోంది. నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా 49 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 47 శాతం, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 44 శాతం మందికి పనులు లభించాయి. రాజధానికి సమీపంలోని జిల్లా మేడ్చల్‌లో 14 శాతం మందికి మాత్రమే ఉపాధి దొరుకుతోంది. నల్గొండలో 30 శాతం, ఖమ్మంలో 33, నిజామాబాద్‌ 34, కామారెడ్డి 38, సంగారెడ్డి 29,  మహబూబాబాద్‌ 41, భద్రాద్రి కొత్తగూడెం 32, సిద్దిపేట 36, వికారాబాద్‌ 42, మెదక్‌ 37, నాగర్‌కర్నూల్‌ 31, ఆదిలాబాద్‌ 39, జోగులాంబ గద్వాల 31, యాదాద్రి భువనగిరి 28, జగిత్యాల 29, కరీంనగర్‌ 27, రంగారెడ్డి 29, వనపర్తి 28, జనగామ 37, జయశంకర్‌ భూపాలపల్లి 41, మంచిర్యాల 36, పెద్దపల్లి 31, మహబూబ్‌నగర్‌ 32, వరంగల్‌ 36, నారాయణపేట 35, రాజన్న సిరిసిల్ల 31, హనుమకొండ 32, ములుగు జిల్లాలో 35% మంది ఉపాధి పొందుతున్నారు.

పనులు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు

ఉపాధి హామీ పథకంలో తెలంగాణ ప్రభుత్వపరంగా పెద్దఎత్తున పనులు చేపడుతున్నా.. నమోదైన కూలీలకు అవసరమైన మేర పనులు లభించడం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 10.5 కోట్ల పనిదినాలు పూర్తిచేశామని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరింత మందికి ఉపాధి కల్పించేందుకు పనిదినాల సంఖ్యను 12 కోట్లకు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని