Budget 2023: రాష్ట్రానికి మరో‘సారీ’..!
కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మరోసారి నిరాశను మిగిల్చింది. బడ్జెట్‌కు ముందు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలన్నీ బుట్టదాఖలయ్యాయి.
తెలంగాణ సర్కారు వినతులు గాలికి..
ప్రత్యేక నిధులు లేవు.. అప్పులకూ తిప్పలు
మళ్లీ నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మరోసారి నిరాశను మిగిల్చింది. బడ్జెట్‌కు ముందు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఆర్థికమంత్రి నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలకు బడ్జెట్‌లో స్థానం దక్కలేదు. పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా అందే నిధులు మినహా రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విజ్ఞప్తులు చేసినా, మంత్రులు లేఖలు రాసినా ఎలాంటి ప్రత్యేక ఊరట లభించలేదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆనాటి హామీల అమలుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ప్రత్యేక తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా ఫలితం దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక లేఖ ద్వారా పలు అంశాలను నివేదించింది. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రికి రాసిన లేఖలో హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేకంగా నిధులివ్వాలని కోరారు. బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు కేంద్రానికి నివేదించారు.రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఒక్క వినతిని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరమైన హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక తోడ్పాటును రాష్ట్రం కోరింది. ప్రధానంగా మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు రూ.8,453 కోట్లు ఇవ్వాలని కోరినా కేంద్రం బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ప్రస్తావన లేకుండా పోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర బడ్జెట్‌లో నిధుల తోడ్పాటును అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా కోరుతున్నా ఫలితం దక్కలేదు. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లను ప్రత్యేకంగా ఇవ్వాలని అయిదేళ్ల కిందటే నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ప్రత్యేక తోడ్పాటు కూడా రాష్ట్రానికి కరవైంది.
సిఫార్సులకూ దిక్కులేదు
తెలంగాణకు 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ.2,362 కోట్ల ప్రత్యేక నిధులివ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. గత బడ్జెట్‌లో దీన్ని ఆమోదించకపోగా ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగింది. వంద శాతం ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తున్న మిషన్ భగీరథ నిర్వహణకు రూ.2,350 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం విన్నవించింది. కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరినా పరిగణనలోకి తీసుకోలేదు. బీఆర్‌జీఎఫ్‌కు సంబంధించి తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు 2019-20 నుంచి ఇవ్వాల్సిన రూ.1,350 కోట్ల బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ వినతులూ గాలికి పోయాయి. హైదరాబాద్ మెట్రోతో పాటు వరంగల్ నియో మెట్రోకు నిధులను ఆశించినా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్ల నుంచి పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులివ్వాలని కోరుతున్నా కేంద్రం ఈసారీ మొండిచెయ్యే చూపింది. తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటాగా వచ్చే రూ.21,470 కోట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ఐఐఎం సహా ప్రముఖ విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరినా ఈసారి కూడా ఒక్క విద్యాసంస్థనూ ప్రకటించలేదు. గతంలో రద్దు చేసిన ఐటీఐఆర్‌ను పునరుద్ధరించి రాష్ట్రానికి ఇవ్వాలని కోరినా కేంద్రం స్పందించలేదు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెరగలేదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బడ్జెట్ వెలుపల ప్రభుత్వ పూచీకత్తుతో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటిని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురావడంతో రాష్ట్రానికి నిధుల లభ్యతపై ప్రభావం చూపింది. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల్లో కోత విధించడంతో రాష్ట్రం అంచనాల్లో సుమారు రూ.19,000 కోట్ల రుణాలను పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు సడలించాలని, కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్రాలకు కూడా వర్తింపచేయాలని కోరుతూ తెలంగాణ సర్కారు శాసనసభలో ప్రత్యేకంగా చర్చించి నివేదించింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచడంతో పాటు, కార్పొరేషన్ రుణాలను దాని పరిధి నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. జీఎస్‌డీపీలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతం కంటే పెంచాలన్న విజ్ఞప్తినీ పట్టించుకోలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kamal Haasan: ఆ రోజు వాళ్లెవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు: కమల్ హాసన్
-
Sports News
Sunil Gavaskar: ఆ విషయంలో అతడు ధోనీని గుర్తు చేస్తాడు : హార్దిక్ పాండ్యపై గావస్కర్ ప్రశంసలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య