కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కేటాయించాలి

కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా కేటాయించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం..కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు.

Published : 02 Feb 2023 03:50 IST

జల్‌శక్తి మంత్రి షెకావత్‌కు కోదండరాం వినతి

ఈనాడు, దిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా కేటాయించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం..కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..దశాబ్దాల పాటు పోరాడి త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నా, కృష్ణా జలాల్లో మాత్రం న్యాయమైన వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలించుకుపోతోందని ఆక్షేపించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.50 శాతంగా ఉండగా, జలాల్లో మాత్రం కేవలం 37 శాతం మాత్రమే దక్కుతున్నాయన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం గెజిట్‌లో పేర్కొనడంతో నదీ జలాల్లో రాష్ట్ర వాటాను వినియోగించుకునే దారులు మూసుకుపోయాయని వాపోయారు. తద్వారా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం నెలకొందన్నారు. అనంతరం ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ను కలిశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్రస్థాయి సంస్థల విభజన సత్వరమే పూర్తిచేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు