మధ్యతరగతిని పక్కదారి పట్టించే బడ్జెట్‌

‘కేంద్రం ప్రవేశపెట్టింది రాజకీయ-ఆర్థిక బడ్జెట్‌. మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని గుర్తించి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎక్కువగా జరిగినట్లు కనిపిస్తోంది’ అని ఆర్థిక శాస్త్రవేత్త, హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు.

Published : 02 Feb 2023 03:50 IST

పేదలు, అణగారిన వర్గాలను పట్టించుకోలేదు
ప్రభుత్వ పెట్టుబడుల పెంపు నిర్ణయం మంచిదే
వ్యవసాయ, ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ‘కేంద్రం ప్రవేశపెట్టింది రాజకీయ-ఆర్థిక బడ్జెట్‌. మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని గుర్తించి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎక్కువగా జరిగినట్లు కనిపిస్తోంది’ అని ఆర్థిక శాస్త్రవేత్త, హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి మాట్లాడుతూ మధ్యతరగతి కోసం ఎక్కువగా చేశామని చెప్పారన్నారు. ఆర్థికమంత్రి కూడా ఆదాయపన్ను గురించి చెప్తూ కష్టపడి పనిచేసే మధ్యతరగతి అంటూ మాట్లాడారన్నారు. మరి ఆ కష్టపడి పనిచేసే మధ్యతరగతి ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకురాలేదన్నారు. పేద రైతులు, అణగారిన వర్గాల గురించి పట్టించుకోలేదన్నారు. కేంద్రబడ్జెట్‌పై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘‘ప్రైవేటు పెట్టుబడులు 2014-15 తర్వాత తగ్గిపోయాయి. మొత్తం పెట్టుబడులు కూడా 32 నుంచి 28 శాతానికి తగ్గాయి.  ప్రైవేటు రంగంలో ఉత్పత్తి చేసిన వాటిలో 60 నుంచి 70 శాతానికి మించి మార్కెట్‌ కావడం లేదు. ఒకవైపు మిగులు ఉంటే ఇంకోవైపు అదనంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలనుకోవడం మంచిదే. మూడు సంవత్సరాల క్రితం కూడా దీని గురించి మాట్లాడారు. ఆలస్యమైనా సానుకూల నిర్ణయం వచ్చింది. మహిళల ప్రాధాన్యం గురించి కూడా ఎక్కువ మాట్లాడారు. ప్రధానమంత్రి స్వయం సహాయక సంఘాల గురించి చెప్పారు. ఈ సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల ప్రారంభం, నిర్వహణ, వారికి రాయితీలు ఇవ్వడంలో ప్రస్తుతం కేంద్రప్రభుత్వ పాత్ర ఏమీలేదు. సున్నా వడ్డీ సహా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినవే. వ్యవసాయరంగం గురించి బడ్జెట్‌లో చెప్పినవి చూస్తే అవి ఆ రంగాన్ని గట్టెక్కించే చర్యలు కాదనిపిస్తోంది. డిజిటల్‌, స్టార్టప్‌ల గురించి బడ్జెట్‌లో చెప్పినా వాటివల్ల వ్యవసాయరంగం మెరుగుపడదు. సహకారరంగాన్ని ప్రోత్సహించడం, గోడౌన్ల నిర్మాణానికి చర్యలు మంచివే. ప్రకటనలకు పరిమితం చేయకుండా కార్యరూపం దాల్చాలి. కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేస్తారో చూడాల్సి ఉంది. సన్న, చిన్నకారు రైతులకు పి.ఎం.కిసాన్‌ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని రూ.ఆరువేల నుంచి రూ.ఎనిమిది వేలకు పెంచుతారనే ప్రచారం జరిగినా చేయలేదు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారు. ఈ రెండూ చూస్తే పేదలు, సన్న, చిన్నకారు రైతులకు ఏమీ చేయకపోయినా ఏం కాదులే అన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది’’ అని నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు