పురపాలికల్లో ఆగని అసమ్మతి

రాజధాని హైదరాబాద్‌ శివార్లలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్మన్లపై మొదలైన అసమ్మతి కార్చిచ్చులా వ్యాపిస్తోంది.

Published : 02 Feb 2023 05:22 IST

దమ్మాయిగూడ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం
అదే బాటలో కొంపల్లి కౌన్సిలర్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ శివార్లలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్మన్లపై మొదలైన అసమ్మతి కార్చిచ్చులా వ్యాపిస్తోంది. మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం మేడ్చల్‌లోని జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థ నుంచి మొదలైన అసమ్మతి నాలుగురోజుల్లోనే ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌, మేడ్చల్‌ మున్సిపాలిటీలకు విస్తరించింది. తాజాగా బుధవారం దమ్మాయిగూడ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ప్రణీతపై 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం రూపొందించి మేడ్చల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సమర్పించారు. కొంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఛైర్మన్‌ శ్రీశైలం యాదవ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రహస్య ప్రాంతంలో ఎనిమిది మంది భారాస కౌన్సిలర్లు సమావేశం కాగా.. వారికి భాజపా, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించినట్టు తెలిసింది. ఇక్కడ 18 మంది కౌన్సిలర్లుండగా.. అవిశ్వాస తీర్మానంపై 13 మంది సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు జవహర్‌నగర్‌ అసమ్మతి కార్పొరేటర్లు గురువారం గుంటూరు నుంచి హైదరాబాద్‌కు చేరుకుని.. జిల్లా కలెక్టర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌, ఆర్డీవోలను కలుసుకోనున్నారు. అసమ్మతి గళమెత్తిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాల కోసం తక్షణం సమావేశాలు నిర్వహించాలంటూ అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. అసమ్మతిని చల్లార్చేందుకు భారాస నాయకులు, ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానాల గడువు నాలుగేళ్లకు పెంచుతూ సర్కార్‌ చేసిన బిల్లుపై నోటిఫికేషన్‌ వెలువడిందంటూ ప్రచారం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలు చెల్లబోవని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు