పోలీసింగ్‌ పదునెక్కేనా!

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని పథకాలకు నిధుల పెంపుదలతో రాష్ట్ర పోలీసుశాఖలోని కొన్ని విభాగాలకు మేలు జరిగే అవకాశం ఉంది.

Updated : 02 Feb 2023 05:41 IST

నిధుల పెంపుతో మెరుగుదలకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని పథకాలకు నిధుల పెంపుదలతో రాష్ట్ర పోలీసుశాఖలోని కొన్ని విభాగాలకు మేలు జరిగే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ అండ్‌ సపోర్ట్‌ సిస్టం వల్ల కంట్రోల్‌రూమ్‌ల ఆధునికీకరణకు వీలవుతుంది. తద్వారా ఆపద సమయంలో పోలీసులు బాధితులను చేరుకోవడం సులభమవుతుంది. ఈ విభాగానికి ఈసారి గత బడ్జెట్‌ కంటే ఆరు రెట్లు నిధులు పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెరుగుతుండడంతో బాధితులకు న్యాయం చేసేందుకు ఐ4సీ ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోనూ దీనికి సంబంధించిన కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా బ్యాకింగ్‌ వ్యవస్థతో ఇది అనుసంధానమై ఉంటుంది. ఎవరైనా సైబర్‌ నేరగాళ్లబారిన పడి డబ్బు పోగొట్టుకుంటే 1930కి ఫోన్‌ చేసి వివరాలు చెబితే వెంటనే ఆ డబ్బు నిందితుడి ఖాతాలో జమకాకుండా ఆపడానికి అవకాశం ఉంది. దీనికి కేటాయింపులు పెంచడం వల్ల బాధితులకు మరింత న్యాయం జరిగే అవకాశం ఉంది. అలానే ఐఓసీజే బడ్జెట్‌ కూడా భారీగా పెంచారు. ఈ పథకం కింద పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రాన్ని ఎంపిక చేశారు. పోలీస్‌స్టేషన్లు, జైళ్లు, న్యాయస్థానాల మధ్య ప్రత్యేక నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసేందుకు దీన్ని నిర్దేశించారు. తద్వారా జైలు నుంచి విడుదలైన వారిపై నిఘా పెట్టడానికి వీలవుతుంది. అలానే ఆన్‌లైన్లోనే న్యాయవిచారణ జరిపే వెసులుబాటు కూడా ఉంటుంది. తద్వారా విచారణ సమయం బాగా తగ్గుతుంది. ఇక మహిళా భద్రత, నిర్భయ ఫండ్‌ నిధులను గతంలో కంటే భారీగా పెంచారు. మహిళా భద్రతకు పెంచడం వల్ల పోలీస్‌స్టేషన్ల స్థాయిలో మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను మరింత మెరుగుపరచవచ్చు. నిర్భయ ఫండ్‌ నిధులను ప్రధానంగా అత్యాచారం  కేసులలో దర్యాప్తునకు అవసరమైన ఉపకరణాలు అంటే డీఎన్‌ఏ కిట్ల వంటివి కొనుగోలు, బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు నిర్దేశించారు. బడ్జెట్‌లో వీటికి కేటాయింపులు పెంచడం వల్ల రాష్ట్రాల్లోని ఆయా పథకాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని