నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములు వైద్య కళాశాలకు కేటాయింపు సబబే

ఏపీలోని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (ఆర్‌ఏఆర్‌ఎస్‌) చెందిన 50 ఎకరాలను వైద్య కళాశాల ఏర్పాటుకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది.

Published : 02 Feb 2023 05:22 IST

సమర్థించిన హైకోర్టు
ప్రజాహిత వ్యాజ్యాలు కొట్టివేత

ఈనాడు, అమరావతి: ఏపీలోని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (ఆర్‌ఏఆర్‌ఎస్‌) చెందిన 50 ఎకరాలను వైద్య కళాశాల ఏర్పాటుకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. భూకేటాయింపును సమర్థించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన 50 ఎకరాలను వైద్య కళాశాలకు కేటాయిస్తూ రెవెన్యూశాఖ 2020 డిసెంబరు 12న జారీ చేసిన జీవో 341, వ్యవసాయ యూనివర్సిటీ పాలకమండలి చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ నంద్యాలకు చెందిన బొజ్జా దశరథరామిరెడ్డి మరికొందరు, న్యాయవాది ఆదిరామకృష్ణుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. మరోవైపు ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన భవనాన్ని నంద్యాల కలెక్టరేట్‌కు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం.. బుధవారం నిర్ణయాన్ని వెల్లడించింది. వైద్య కళాశాలకు అనువైన భూమి లేకపోవడంతో ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని తీసుకోవాల్సి వచ్చిందన్న ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ‘జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల ప్రకారం వైద్య కళాశాల ఏర్పాటుకు నంద్యాల జిల్లా ఆసుపత్రికి 10.కి.మీ.పరిధిలో తగిన భూమి లేదు. వైద్య కళాశాల కోసం ఈ భూమిని కేటాయించడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధం కాదు. తీసుకుంటున్న 50 ఎకరాలకు బదులు తంగడంచలోనే మరో 50 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యామ్నాయంగా కేటాయిస్తామన్న ఈ భూమి వ్యవసాయ పరిశోధనకు పనికిరాదనే పిటిషనర్‌ వాదనలు నిరాధారం. నంద్యాలలో కళాశాల పనులూ ప్రారంభమయ్యాయి. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భవనాన్ని నంద్యాల జిల్లా కలెక్టరేట్‌కు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన నిర్దుష్ట కాలానికి కేటాయించారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టేస్తున్నాం’ అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు