భద్రత కోసమే చర్లపల్లి జైలుకు

ఒక మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన బైరి నరేష్‌ను పరిగి జైలు నుంచి భద్రత కోసమే చర్లపల్లి జైలుకు తరలించారని, ఈ విషయం నరేష్‌కు తెలియదని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు.

Published : 02 Feb 2023 05:48 IST

బైరి నరేష్‌ తరలింపుపై హైకోర్టుకు నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఒక మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన బైరి నరేష్‌ను పరిగి జైలు నుంచి భద్రత కోసమే చర్లపల్లి జైలుకు తరలించారని, ఈ విషయం నరేష్‌కు తెలియదని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. నరేష్‌ను చర్లపల్లి జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచడాన్ని సవాలు చేస్తూ భార్య సుజాత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి జైలులో వాస్తవ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి జనవరి 30న చర్లపల్లి జైలును సందర్శించి అక్కడి సూపరింటెండెంట్‌ ఆర్‌.సంతోష్‌కుమార్‌తోపాటు జైలులో ఉన్న నరేష్‌ను విచారించి నివేదిక సమర్పించారు. ‘‘పరిగి జైలులో భద్రత కల్పించలేమని అక్కడి జైలు అధికారులు చెబుతున్నారని, అందువల్ల చర్లపల్లి జైలుకు నరేష్‌ను పంపుతున్నామని జూనియర్‌ సివిల్‌ జడ్జి లేఖ రాశారని జైలు సూపరింటెండెంట్‌ చెప్పారు. నరేష్‌ ప్రాణానికి ప్రమాదం ఉందని సమాచారం అందడంతో ప్రత్యేకంగా ఉంచామన్నారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీలను ఉంచే గదిలోనే ఉంచుతున్నామని చెప్పారు.’’ అని నివేదికలో పేర్కొన్నారు. భోజనం ప్రస్తుతం మిగిలినవారితోపాటు పెడుతున్నారని నరేష్‌ చెప్పారన్నారు.  గతంలో రేప్‌, కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన సీఐ నాగేశ్వరరావును కూడా భద్రత రీత్యా నరేష్‌ మాదిరిగానే విడిగా ఉంచినట్లు జైలు అధికారులు చెప్పారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని